Tuesday, April 30, 2024

ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీల ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రైవేటు స్కూళ్ళు, జూనియర్‌ కాలేజీల ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఫీజు రెగ్యూలేషన్‌ చట్టం కోసం ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌ ఎస్వీకెలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌ నేత నాగాటి నారాయణ, బాలల హక్కుల పరిక్షణ వేదిక నేత ఎ. సంతోష్‌ కుమార్‌, ఆలిండియా పేరెంట్స్‌ అసోసియేషన్‌ నాయకుడు బ్రహ్మయ్య తదితర నేతలు పాల్గొని ప్రైవేటు కార్పోరేట్‌ స్కూళ్ళు, కాలేజీల ఫీజుల సమస్య తీవ్రతపై చర్చించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల్లో ఫీజు రెగ్యూలేషన్‌ చట్టం చేయకపోవడం వలన ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచి వసూలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. పెంచిన ఫీజులను కట్టడానికి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని వారు తెలిపారు. ఈ పరిస్థితిని నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి అధిక ఫీజులను అరికట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు రెగ్యూలేషన్‌ చట్టాల్లో రాజస్థాన్‌ చట్టం ఉత్తమంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌ కూడా అదే విధంగా చేసిందన్నారు. రాజస్థాన్‌ తరహాలో రాష్ట్ర స్థాయి కమిటీ ఆధ్వర్యంలో మూడేళ్లకోసారి ఫీజులు నిర్ణయించే విధంగా చట్టం చేయాలని వారు కోరారు. ఉన్నత, ప్రొఫెషనల్‌ కోర్సులకు టీఏఎఫ్‌ఆర్సీ ఫీజులు ఫిక్స్‌ చేస్తున్నట్లే స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీల ఫీజులు ఫిక్స్‌ చేయాలని వారు సూచించారు. ప్రతి ఏటా పది శాతం చొప్పున ఫీజులు పెంచుకోవచ్చనే తిరుపతి రావు కమిటీ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకోవద్దని వారు అభ్యంతరం తెలిపారు. ఫీజుల నిర్ణయాన్ని స్కూల్‌ లెవల్‌ కమిటీకి అప్పగించాలనే ప్రతిపాదన విరమించుకోవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement