Monday, April 29, 2024

Kerala | రాష్ట్రపతి చర్య రాజ్యాంగ విరుద్ధం.. ద్రౌపది ముర్ముపై సుప్రీం ఫిర్యాదు

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులను కారణాలు చూపకుండా నిలిపివేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళలోని సీపీఎం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి చర్య రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విశ్వవిద్యాలయ చట్టాలు (సవరణ) (నెం.2) బిల్లు, 2021, కేరళ సహకార సంఘాల (సవరణ) బిల్లు, 2022, విశ్వవిద్యాలయ చట్టాలు (సవరణ) బిల్లు, 2022, విశ్వవిద్యాలయ చట్టాలు (సవరణ) (నంబర్ 3) బిల్లు 2022 అనే నాలుగు బిల్లులకు ఎటువంటి కారణాలు చెప్పకుండా ఆమోదం తెలియచేయకపోవడాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని తన పిటిషన్‌లో ర్రాష్ట్ర ప్రభుత్వం అర్థించింది.

ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి కార్యదర్శి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆయన అదనపు కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ నాలుగు బిల్లులతోపాటు మొత్తం ఏడు బిల్లులను పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరింది. సుదీర్ఘకాలంపాటు, నిరవధికంగా బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం, కొన్నిటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం వంటి గవర్నర్ చర్యలు రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించడమేనని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే నాలుగు బిల్లులను కేంద్ర ప్రభుత్వ సలహాతో రాష్ట్రపతి పెండింగ్‌లో ఉంచడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని కూడా కేరళ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేగాక రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద కేరళ ప్రజలకు లభించే హక్కులను హరించి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ప్రజా సంక్షేమ బిల్లుల ప్రయోజనాలు ప్రజలకు దక్కకుండా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. గత ఏడాది కూడా అనేక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా నవంబర్ 20న గవర్నర్‌కు సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement