Saturday, May 18, 2024

ప్ర‌కాశం బ్యారేజీకి భారీ వ‌ర‌ద‌నీరు-25గేట్లు ఎత్తివేత‌

విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది. దాంతో బ్యారేజీ 25 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ఇప్పటికే కాల్వల ద్వారా ఖరీఫ్ సాగుకు కృష్ణా తూర్పు, పడమరలకు నీటిని విడుదల చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజుల పాటు పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున మత్స్యకారులు ఆదివారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు ఫోన్ నంబర్ 0863-2377118, హెల్ప్ లైన్ 18004250101తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియగా.. శనివారం జిల్లా వ్యాప్తంగా సగటున 309 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పోలవరం ముంపు మండలం దేవీపట్నం మండలంలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement