Sunday, May 5, 2024

గంజాయి స్మగ్లింగ్‌లో పోలీసులు.. సరిహద్దు జిల్లాల్లో పట్టుబడుతున్న పొరుగు రాష్ట్రాల ఖాకీలు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మత్తు, మాదక ద్రవ్యాలకు చోటు ఉండకూడదనేది ప్రభుత్వ అభిమతం. డ్రగ్స్‌, గంజాయి, సారా, అక్రమ మద్యం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం ఉండరాదని ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ ఖచ్చిత నిర్ణయం. అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని సర్కార్‌ ఆదేశం. ముఖ్యంగా విద్యార్ధులు, యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు మాదక ద్రవ్యాలను రాష్ట్రంలో పూర్తిగా కట్టడి చేయాలని ఇటీవలే డీజీపీ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ గంజాయి సాగు, రవాణాకు చిరునామాగా పేరొందని మన రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు లక్షల రూపాయలు విలువ చేసే టన్నుల కోద్దీ సరుకును నిత్యం స్మగ్లర్లు సరిహద్దులు దాటించేస్తున్నారు. వీటిని కట్టడి చేసేందుకు ఎస్‌ఇబి నిరంతరం పని చేస్తున్నా ఆగడం లేదు. స్మగ్లర్లు గంజాయి రవాణాలో ఆరితేరిపోయారు. ప్రతి అవకాశాన్ని పావుగా చేసుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో పోలీసుల కళ్లు గప్పి స్మగి ్లంగ్‌కు పాల్పడుతున్నారు. ఇందుకోసం క మీషన్ల ఆశ జూపి యువకులు, కరుడుగట్టిన నేరగాళ్ళను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటి వరకు ఇలా కొనసాగుతుంటే గంజాయి మాఫియా తమ సరుకు రవాణా కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులను సైతం వినియోగించుకోవడం ఒక పరిణామం.

ఈక్రమంలోనే మరో అడుగు ముందుకేసి పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో గంజాయి రవాణాలో మహిళలను సైతం స్మగ్లర్లుగా భాగస్వామ్యం చేయడం మరో పరిణామం. గిరిజన మహిళలే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా పొట్ట చేత్తో పట్టుకుని రాష్ట్రానికి వస్తున్న మహిళలను ఎంతోమంది అధిక మొత్తంలో కమీషన్లు ఎరగా వేసి వారిచే సరుకు పొరుగు రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. అయితే గంజాయి మాఫియా మరింతగా తెగించి సరుకు స్మగ్లింగ్‌లో పోలీసులను భాగస్వాములను చేయడం పరిణామాల పరాకాష్ట. గంజాయి సాగుకు విశాఖ ఏజెన్సీ ప్రాంతం పెట్టింది పేరు. జిల్లాల విభజన తర్వాత విశాఖ జిల్లా నుంచి: అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇప్పుడు అల్లూరి జిల్లా పరిధిలోకి గంజాయి సాగు ప్రాంతం విస్తరించి ఉంది. దీంతో గంజాయి సాగు, రవాణా మీద దృష్టి సారించిన ఏపీ పోలీసులకు తాజాగా ఈ అక్రమ రవాణాలో పోలీసులే భాగస్వాములుగా ఉన్నార న్న సమాచారం విస్మయం కలిగించింది.

స్మగ్లింగ్‌ కోసమే కాదు.. వ్యాపారంలోనూ పోలీసులు భాగస్వాములై లక్షలు గడిస్తున్నారన్నది ఏపీ పోలీసుల వద్ద ఉన్న సమాచారం. అయితే గంజాయి వ్యాపారం, రవాణాలో భాగస్వాములుగా చలామణి అవుతున్నది పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులు అని తెలియడంతో ఏపీ పోలీసుశాఖకు కొంత ఉూరట కలిగించే విషయం. అయితే పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులు స్మగ్లర్లతో కలిసి ఏజెన్సీకి వచ్చి పెద్ద మొత్తంలో గంజాయి కొనుగోలు చేసి సరిహద్దు దాటించేందుకు మన రాష్ట్ట్రంలోని సరిహద్దు జిల్లాలకు చెందిన కొందరు ఖాకీల సహకారం ఉందనడంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా ఏపీ పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి కేసుల్లో చాలావరకు కూలీలే పోలీసులకు చిక్కుతున్నారు. అయితే తాజాగా పోలీసులూ పట్టుబడే సరికి ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడిన మీదట తర్వాత ఈ తరహా ఘటనలను చేధించే పనిలో ఉన్నారు ఆ జిల్లా పోలీసులు.

స్మగ్లర్లలో పొరుగు రాష్ట్రాల పోలీసులు..
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లలో చాలామంది పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఉంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మన పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇటీవల పలువురు పొరుగు రాష్ట్రాల పోలీసులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడటం ఆందోళన కలి గిస్తోంది. దీంతో అల్లూరి పోలీసులు మరింత అప్రమత్తమై ఈ వ్యవహరంపై లోతుగా విచారణ ప్రారంభించారు. జిల్లాలోని ముంచంగి పుట్టు- మండలం లబ్బూరు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ బొలెరో వాహనాన్ని అనుమానంతో చెక్‌ చేశారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని విధంగా సమాధానం చెప్పారు. దీంతో కారు తనిఖీ చేసిన పోలీసులు 560 కిలోల గంజాయి గురి ్తంచి స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఇద్దరిని విచారించగా, ఓ వ్యక్తి ఒడిస్సాకు చెందిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుమార్‌గా వెల్లడైంది. అంతకుముందు కూడా పాడేరులో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు.

అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన కానస్టేబుల్‌ జ్ఞానేశ్వర్‌ యోగేష్‌గా పోలీసులు గుర్తించారు. అవాక్కయిన పోలీసులు మరింత విచారణ చేయగా స్మగ్లర్లతో చేతులు కలిపి గంజాయిని సరిహద్దులు దాటిస్తున్నట్లు వెల్లడైంది. అదేవిధంగా అల్లూరి జిల్లా జీ మాడుగుల వద్ద తనిఖీలో అత్యంత ఖరీదైన కార్లలో గంజాయిని ఢిల్లీకి తరలిస్తున్న ముఠా పట్టు బడింది. డోర్‌ ఖాళీలో కుక్కి ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తుండగా నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మన పోలీసులు. అయితే ఈ తరహా ఖరీదైన స్మగ్లర్లకు ఆయా రాష్ట్రాల్లోనే పోలీసుల సహకారం లేకపోలేదని తెలుస్తోంది. దీంతో దూకుడు పెంచిన ఏపీ పోలీసులు ఇటీవలే ఓ అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేయడం జరిగింది. రెండు నెలల వ్యవధిలో పాడేరు పరిధిలో 25 కేసులు నమోదు చేసి సుమారు 3000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం విశేషం. కాగా ఈ చీకటి వ్యాపారంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన కొందరు పోలీసులు భాగస్వాములవుతుండగా బడా వ్యాపారులకు అక్కడి మరికొందరి పోలీసుల పరోక్ష సహకారం ఉన్నట్లే ఏపీలోనూ ఈ తరహా పరిస్ధితిపై మన యంత్రాంగం ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఉన్నతస్ధాయిలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement