Sunday, May 16, 2021

ఎన్నికలు ముగిశాయి..పెట్రోలు ధరలు పెంచేశారు!

ముందుగా ఊహించిందే జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేశాయి. గడచిన రెండు నెలల వ్యవధిలో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే పెట్రోలు ధరల సవరణ జరిగింది. అది కూడా ధరల తగ్గింపు మాత్రమే కనిపించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే ధరలు పెరగడం గమనార్హం. 18 రోజుల పాటు పెరగని ధరలు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రకటన వెలువడింది. దీంతో పెట్రోలు ధర రూ. 90.56కు, డీజిల్ ధర రూ.80.73కు పెరిగింది.

ఇండియాలో పన్నులు లేకుంటే, పెట్రోలు ధర లీటరుకు రూ. 33 మించదు. ఉదాహరణకు ఢిల్లీనే చూసుకుంటే, అక్కడ లీటరు పెట్రోలు ధర రూ. 32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్, వ్యాట్ కలిపి రూ. 19.55 కాగా, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం రూ. 31.83, వ్యాట్ రూ. 10.99 ఉంది. దీనికి డీలర్ కమిషన్ అదనం. పన్నుల భారాన్ని తగ్గిస్తే, పెట్రోలు ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నా, ఆయిల్ రంగాన్ని తమకున్న ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిన కారణంగానే ధరలను పెంచలేదని, మొత్తం మీద 7 శాతం వరకూ డిమాండ్ తగ్గిందని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయని, ఆ కారణంగానే ఇండియాలోనూ ధరలను సవరించాల్సి వచ్చిందని స్పష్టం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News