Monday, April 29, 2024

పెట్రో మంట .. తప్పదా

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలు కారణాల వలన అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు బ్యారెల్‌ 50 డాలర్ల నుంచి 70 డాలర్లకు పెరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన లీటరుకు రూ.3 పెట్రో ధర ప్రజలను నాశనం చేస్తోందని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నానాయాగీ చేసి ఆందోళనలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ స్వరమే మారిపోయింది. పెట్రోలియం కంపెనీలకు తొత్తుగా మరిపోయింది. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా పెట్రోలియం కంపెనీలు ధరలు తగ్గించకుండా రోజురోజుకూ పెంచుకుంటూ పోయి లాభాలను గుంజుకున్నాయి. అవే కంపెనీలు ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పెరగడంతో నష్టాలు చవి చూడాల్సి రావడంతో ధరల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. లీటర్‌ పెట్రోల్‌ రూ. 150 , డీజల్‌ రూ. 140లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగే పక్షంలో అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు మరింత పైకి ఎగిసే అవకాశం ఉండడంతో దేశీయంగా పెట్రోల్‌ రూ. 200 వరకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

అధికార పక్షాలకు ఉక్రెయిన్‌ యుద్ధం ఎదురుదెబ్బే..

కాగా , ఒకవేళ పెట్రో ధరల పెంపు ఖాయం అయితే రవాణా చార్జీలు మరింత పెరగనున్నాయి. దీంతో రవాణా రంగంపై ఆధారపడ్డ నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర ధరవరలపై ప్రభావం పడనుంది. నిత్యావసరాల ధరలు పెరిగితే మధ్య, పేద తరగతి వర్గాల ప్రజల బతుకులు మరింత భారం కానున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ మహమ్మారితో కుదేలైపోయిన అన్ని రంగాలు జీతాలను తగ్గించడమే కాకుండా పలువురిని ఉద్యోగాల నుంచి కూడా తొలగించాయి. పెట్రోల్‌ ధరల పెంపు అటు వాహనదారులపైనే కాకుండా రవాణా రంగం, ధరలను పెంచే అవకాశం ఉండడం పేద ప్రజలకు మరింత శాపంగా మారనుంది. పెట్రోలియం ధరల పెంపు కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచనున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగి మరింత ధరలు పెరిగితే ఆ ప్రభావం కూడా మరింత పెరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement