Monday, April 29, 2024

వరదల్లో పాకిస్తాన్‌.. దేశంలో సగభాగం మునక

పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తాయి. రుతుపవనాల అతితీవ్రత వరద సంక్షోభానికి దారితీసింది. దేశంలోని సగ భూభాగం నీట మునిగింది. ముఖ్యంగా, సింధ్‌, బలూచిస్తాన్‌, ఉత్తర ఖైబర్‌ ఫంక్తున్‌ఖ్వా, స్వాత్‌లోయ ప్రాంతాలు గతదశాబ్ద కాలంలో తొలిసారి దారుణమైన వరదలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు వందలాది మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు అని డాన్‌ పత్రిక పేర్కొంది. దేశంలోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చాయి. అనూహ్య రుతుపవనాలు అసాధారణ సంక్షోభాన్ని సృష్టించాయని వాతావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహ్మాన్‌ సోమవారం వెల్లడించారు. 3.3 కోట్ల మంది ప్రజలు వరదలకు ప్రభావితం అయ్యారు. దాదాపు 10లక్షల ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి. 8 లక్షల పశువులు మృతి చెందాయి. జూన్‌ నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా 1061 మంది మరణించారు. 1575 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో 11 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా 29 మంది మృతిచెందారు. 3.3 కోట్ల మంది వరదల్లో చిక్కుకున్నారు. ఈ సంఖ్య దేశ జనాభాలో 15శాతానికి సమానం. ఏడుగురు పాకిస్తానీలలో ఒకరు వరదలకు ప్రభావితం అయ్యారు.

వంతెనలు, రహదారులు ధ్వంసం

ఈ ప్రాంతం భారీ సముద్రం మాదిరిగా కనిపిస్తోంది. నీటిని బయటకు పంపే మార్గాలేమీ కనిపించడం లేదని ఆమె తెలిపారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, వరదనీటి కారణంగా దేశంలోని మిగతా ప్రాంతాలతో స్వాత్‌వ్యాలీకి సంబంధాలు తెగిపోయాయి. ఆహారం, ఔషధాల కొరత నెలకొంది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్‌ భూభాగంలో సగభాగముౖెన బలూచిస్తాన్‌లో మూడొంతులు వరదలకు ప్రభావితమైంది.4100 కి..మీ రహదారులు, 149 వంతెనలు, టెలికాం. విద్యుత్‌ నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే పాక్‌లో 354.3 మిల్లిd మీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతానికంటే ఇది 113 రెట్లు అధికం.

ఈ దశాబ్దంలో అతిపెద్ద విపత్తు

2010లో ముంచెత్తిన సూపర్‌ ఫ్లడ్‌ కంటే ఇది తీవ్రంగా కనిపిస్తోంది. నాటి వరదల్లో 2 వేల మంది మరణించారు. 2కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మళ్లి ఆస్థాయిలో ఇప్పుడు సంక్షోభం నెలకొంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో కనీస వసతులు లేక బాధితులు ఇబ్బంది పడుతున్నారు. వారాల తరబడి ఎడతెరపిలేని వర్షాలతో లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. ఒక్క బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోనే రూ. 200 బిలియన్ల నష్టం వాటిల్లింది. వరద కష్టాలనుంచి ఆదుకునేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి ఆర్థిక సంస్థలకు పాక్‌ విదేశాంగమంత్రి విజ్ఞప్తిచేశారు. వరదల కారణంగా రవాణా సౌలభ్యం కోసం భారత్‌తో వాణిజ్య కారిడార్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పాక్‌ మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement