Friday, May 17, 2024

మీకు మా మద్దతు.. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాం : బండి సంజయ్

ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షా దృష్తికి తీసుకెళ్లామని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తెలిపారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు మంగళవారం ఆయన హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో భేటీ అయి వర్గీకరణ అంశంపై చర్చించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు నుంచి కిషన్ రెడ్డి వరకు మీకు మద్దతు తెలిపారని అన్నారు. ఎస్సీలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని, నిరుపేదలకు సంక్షేమ ఫలాలు దక్కాలని అబిప్రాయపడ్డారు. అన్ని ఉద్యమాల్లో మంద కృష్ణమాదిగ విజయం సాధించారని, ఎస్సీ వర్గీకరణపై పోరాటంలో కూడా ఆయన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మీపై బీజేపీకి విశ్వాసముందన్నారు. ఎస్సీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి వర్గీకరణ అంశాన్ని తీసుకెళ్తామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.

బీజేపీ తల్చుకుంటే వర్గీకరణ సాధ్యమే : మంద కృష్ణ
అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ… అధికారంంలో ఉండి కూడా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. బీజేపీపై ఎస్సీలు నమ్మకం పెట్టుకున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ తలుచుకుంటే వర్గీకరణ చేయడం అసాధ్యం కాదన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కోరుకున్నట్టు నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందాలన్నారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చేయాలని ఎల్.కే అద్వానీ ఆకాంక్షను గుర్తు చేశారు. పార్లెంటులో బిల్లు పెట్టండి… బీజేపీ మద్దతిస్తుందని సుష్మా స్వరాజ్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంద కృష్ణ ప్రస్తావించారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చేయాలని బీజేపీ 1996 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మానిఫెస్టోలో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ వర్గీకరణ కోసం కనీసం నాలుగు అడుగులైనా ముందుకేసింది గానీ ఏడేళ్ల మోడీ పాలనలో వర్గీకరణ అంశం కొంచెం కూడా ముందుకు పోలేదని ఆరోపించారు. మాదిగలు సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గమని మంద కృష్ణ వాపోయారు. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాను వర్గీకరణ ఒప్పించాలని కోరారు. ఫిబ్రవరిలో దాదాపు 30 లక్షల మందితో పెట్టే తమ సభకు సభకు మోదీ వచ్చేలా బీజేపీ నేతలు ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే సంపూర్ణ మద్దతుతో వర్గీకరణ బిల్లు పాసవుతుందని మంద కృష్ణ మాదిగ విశ్వాసం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement