Monday, April 29, 2024

అధికార కూటమికి దీటుగా ప్రతిపక్ష కూటమి ప్రచారం.. ప్రచార కమిటీలో టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పోటీగా బరిలో దిగిన ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటాపోటీగా ప్రచారపర్వాన్ని మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పాటు తటస్థ రాజకీయ పార్టీల మద్ధతును కూడా సమీకరించేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలో వివిధ పార్టీల నేతలతో ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 11 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు రంజిత్ రెడ్డికి చోటు కల్పించారు.

కమిటీలో మొదటి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జైరాం రమేశ్‌ను నియమించగా, డీఎంకే నేత తిరుచ్చి శివ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుఖేందు అధికారి, సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ నేత డా. రాంగోపాల్ యాదవ్, ఎన్సీపీ నుంచి ప్రఫూల్ పటేల్, టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి, ఆర్జేడీ నుంచి డా. మనోజ్ ఝా, సీపీఐ నుంచి డి. రాజా మిగతా సభ్యులుగా ఉన్నారు. పౌర సమాజం నుంచి సుధీంద్ర కులకర్ణిని కూడా కమిటీలో సభ్యులుగా చేర్చారు. శివసేన తరఫున కూడా ఒక నేతను కమిటీలో పొందుపరిచారు. అయితే ఆ పార్టీ ఇంకా ఎవరినీ ప్రతిపాదించలేదు. మొత్తం ఈ 11 మంది విపక్ష కూటమి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తరఫున దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా స్వతంత్రులు, తటస్థ రాజకీయ పార్టీలతో వారు చర్చలు జరిపి, బీజేపీకి వ్యతిరేకంగా యశ్వంత్ సిన్హాకు ఓటు వేసేలా ఒప్పించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement