Monday, April 29, 2024

ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అన్ని సంస్థలకు అవకాశం.. ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈఎస్ఐ ఆస్పత్రి భవనాల నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్’తో పాటు ఇతర నిర్మాణ సంస్థలు కూడా పాల్గొనేలా వెసులుబాటు కల్పిస్తూ వేగవంతంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గురువారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ సమాధానమిచ్చారు. విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ఈఎస్ఐ ఆస్పత్రుల స్థితిగతుల గురించి జీవీఎల్ ప్రశ్నించారు.

కొత్తగా మంజూరైన 7 ఆస్పత్రుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి కారణాలేంటో తెలపాలని కోరారు. ఈ ప్రశ్నలకు బదులిస్తూ.. ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు మంత్రిత్వ శాఖ ఇటీవల కొన్ని మార్పులు చేసిందని, సీపీడబ్ల్యుడీతో పాటు నిర్మాణాలు చేపట్టే అన్ని ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు భవిష్యత్ నిర్మాణ ప్రాజెక్టులలో పాల్గొంటాయని తెలిపారు. ఆ రకంగా రాష్ట్రంలో మిగతా హాస్పిటళ్ళను తొందరగా పూర్తి చేయగలమని, నిర్మాణంలో ఉన్న 76 ఆసుపత్రులను అనుక్షణం సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ తయారు చేశామని మంత్రి తెలియచేశారు.

రాష్ట్ర ప్రభుత్వ స్థానిక అధికారుల నుంచి రావాల్సిన వివిధ రకాల అనుమతుల్లో జాప్యం కారణంగానే నిర్మాణ పనులు వేగవంతంగా సాగడం లేదని, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. నిర్మాణ కాలవ్యవధిని 4 నుండి 2సంవత్సరాలకు తగ్గించడానికి ఆసుపత్రుల డిజైన్ విషయంలోనూ జాగ్రత్తలు, మార్పులు చేర్పులు చేపట్టినట్టు తెలిపారు. ఇకపై ప్రత్యేకించి విశాఖపట్నం ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ పురోగతి గురించి ఎంపీ జీవీఎల్‌కు ఎప్పటికప్పుడు తెలియచేస్తానని మంత్రి చెప్పారు.

దీనిపై ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ విశాఖపట్నంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన స్థానిక అనుమతులను మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని చూపుతోందని, ఇది కూడా హాస్పిటల్ నిర్మాణం జాప్యం కావడంలో ప్రధాన కారణమని అన్నారు. విశాఖపట్నంలో 4 లక్షల మందికి తక్షణ ప్రయోజనాన్ని చేకూర్చే ఈఎస్ఐ హాస్పిటల్ అత్యంత త్వరగా నిర్మించడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను చేపట్టడానికి తాను పూర్తిగా ప్రయత్నం చేస్తానని విశాఖ ప్రజలకు హామీని ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement