Sunday, April 28, 2024

జొమాటో, స్విగ్గీలకు ఓఎన్‌డీసీ గట్టిపోటీ

ప్రస్తుతం మన దేశంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివీర మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీలదే హవా. సోషల్‌ మీడియాలో కస్టమర్లు పెడుతున్న పోస్టులను బట్టి ఈ రెండు సంస్థల కంటే ప్రభుత్వ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఓఎన్‌డీసీ తక్కువ రేట్లకే ఫుడ్‌ను డెలివరీ చేస్తోంది. చాలా మంది యూజర్లు సోషల్‌ మీడియాలో స్విగ్గీ, జొమాటోలు ఇస్తున్న ధరలను, ఓఎన్‌డీసీ ఇస్తున్న ధరలను పోలుస్తూ అనేక పోస్టులు పెడుతున్నారు. కొన్ని ఫుడ్‌ ఐటమ్స్‌ విషయంలో ఈ తేడా సగం కంటే ఎక్కువగా ఉంటోంది.

ఓఎన్‌డీసీలో ఎందుకు తక్కువ….

ఓఎన్‌డీసీ అంటే ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌. ఇందులో ఎవరైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ప్రత్యేకంగా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం మార్చి చివరి నాటికి ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ 180 నగరాలు, పట్టణాల్లో అందుబాటులోఉంది. ప్రధానంగా చిన్న వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఓఎన్‌డీసీ అడ్వైజరీ కౌన్సిల్‌లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని ఉన్నారు. ఇ-కామర్స్‌ సైట్‌గా దీన్ని డెవలప్‌ చేశారు. పెద్ద, చిన్న వ్యాపారుల మధ్య సమతౌల్యం సాధించేందుకు దీన్ని తీసుకు వచ్చారు.

- Advertisement -

చిన్న వ్యాపారులు తాము సొంతంగా ఇ-కామర్స్‌ సైట్స్‌ను నిర్వహించలేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు ఎలాంటి ప్లాట్‌ఫామ్‌ ఫీ కాని, కమిషన్‌కాని చెల్లించాల్సిన అవసరంలేదు. వ్యాపారులు నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఎలాంటి ఫీ, కమిషన్‌ చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఓఎన్‌డీసీలో తక్కువ రేటుకే వినియోగదారులకు ఫుడ్‌ ఐటమ్స్‌ లభిస్తున్నాయి. వీటి మాదిరిగానే ఇతర ఉత్పత్తులకు కూడా మిడిల్‌మెన్‌ లేకపోవడం వల్ల ఇతర ఇ-కామర్స్‌ సైట్స్‌తో పోల్చితే తక్కువకే వివిధ ఉత్పత్తులు లభిస్తున్నాయి.

స్విగ్గీ, జొమాటోలో 25 శాతం కమిషన్‌…

ప్రైవేట్‌ సంస్థలు నడిపిస్తున్న జొమాటో, స్విగ్గీలో తమ ఉత్పత్తులను విక్రయించాలంటే 3 శాతం ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆర్డర్‌ పై 25 శాతం కమిషన్‌ చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్లె స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో ఓఎన్‌డీసీ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఓఎన్‌డీసీకి సొంత డెలివరీ మెకానిజం లేదు. దీంతో వచ్చిన ఆర్డర్లను ఇ-కార్ట్‌ డొంజో, డెలివరీ వంటి థర్ట్‌ పార్టీ డెలివరీ సంస్థలకు అవుట్‌సోర్స్‌ చేసింది. ఓఎన్‌డీసీలో ఫుడ్‌ ఆర్డర్‌కాని, ఇతర ఉత్పత్తులను థర్ట్‌ పార్టీ యాప్‌ల ద్వారా చేసుకోవచ్చు. ఏపీఎం, మీషో, స్పైస్‌ మనీ, క్రాఫ్ట్‌ విల్లా వంటి వాటి ద్వారా ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఓఎన్‌డీసీ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో ఆర్డర్లు చాలా తక్కువగా వస్తున్నాయని నోయిడాకు చెందిన ఒక రెస్టారెంట్‌ యజమాని చెప్పారు.

జొమాటో, స్విగ్గీ వంటి యాప్స్‌ ఎక్కువ కమిషన్‌ తీసుకుంటున్నాయని, ఓఎన్‌డీసీ వల్ల తమకు ఎంతో ప్రయోజనం ఉందన్నారు. ఇది వినియోగదారులకు కూడా ప్రయోజకరంగా ఉంటుందని, ఎవరికీ పెద్దగా తెలియకపోవంతో ఆర్డర్లు బాగా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అదే స మయంలో ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులకు ఎక్కువ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూడాల్సి ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

ప్రధానంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎక్కువ మంది వ్యాపారులు ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తే, కస్టమర్లకు పెద్ద ఎత్తున ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, దీని వల్ల కస్టమర్ల ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు లోపాలను సరిచేస్తే, ఓఎన్‌డీసీ కస్టమర్లకు మంచి ఛాయిస్‌ అవుతుందని వారు పేర్కొంటున్నారు. ఎలాంటి కమిషన్‌ లేకపోవడం వల్ల ఇతర ఇ-కామర్స్‌ సైట్స్‌తో పోల్చుకుంటే తక్కువ రేటుకే వినియోగదారులు తమకు నచ్చిన ఉత్పత్తిని పొందేందుకు వీలు కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement