Thursday, May 2, 2024

Delhi | ఇంటికొక బీరు, వీధికొక బారు.. ఇదే బీఆర్ఎస్ తీరు: బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఇంటికొక బీరు, వీధికొక బారు అన్నట్టుగా పరిస్థితి తయారైందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లై-ఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన బుధవారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

మూడు వైన్ షాప్ లు, ఆరు బార్లు అన్న రీతిలో బీఆర్ఎస్ పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రం మొత్తాన్ని ప్రభుత్వం మత్తులో ముంచిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే సమయానికి ఉన్న అబ్కారీ ఆదాయంతో పోల్చితే ప్రస్తుతం అనేక రెట్లు పెరిగిందని గణాంకాలతో సహా చెప్పారు. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బంధం విడదీయరానిదని, తెలంగాణలో రెండు పార్టీలు గతంలో కలిసి పోటీ చేశాయని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాన్ని కూడా పంచుకున్నాయని అన్నారు.

కవిత మీద కేసుల విషయంలో కాంగ్రెస్ మాట్లాడటం లేదని, అలాగే రేవంత్‌పై ఉన్న కేసుల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం లేదని ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో  చేరినప్పుడు సైతం రాహుల్ నోరు మెదపలేదని అన్నారు. పార్లమెంట్‌లో ఇద్దరూ అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. లోక్‌సభలో సంఖ్యాబలం లేని బీఅర్ఎస్.. తాము ఎటూలేమని చెబుతూ కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి ఎలా మద్దతు పలికారో చెప్పాలని అన్నారు. గల్లీలో, ఢిల్లీలో కలిసి నడవడమే ఈ పార్టీల విధానమని అన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు కే.కేశవరావు, నామ నాగేశ్వరరావు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తన ఢిల్లీ పర్యటన గురించి వివరిస్తూ.. మంగళవారం రాత్రి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశానని చెప్పారు. ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యంపై ఆయనతో చర్చించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ కారణంగానే జాప్యం జరుగుతోందని ఆరోపించారు. మరోవైపు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం ప్రధాని చేతుల మీదుగా జరపాలని కేంద్ర మంత్రిని కోరినట్టు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement