Sunday, May 19, 2024

Delhi: కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ.. బీజేపీలో చేరిన బూర నర్సయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భువనగిరి మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ బుధవారం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కే. లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ సమక్షంలో డా. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్యతో పాటు వడ్డేపల్లి రాజేశ్వరరావు, రవి ప్రకాశ్ యాదవ్, హరిశంకర్ గౌడ్ సహా మొత్తం 16 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను తనతో పాటు బీజేపీలో చేర్పించారు. పార్టీ సభ్యత్వ నమోదు రసీదును బూర నర్సయ్యకు కేంద్ర మంత్రులిద్దరూ అందజేశారు. పార్టీ కార్యాలయంలో సభ్యత్వం తీసుకున్న తర్వాత సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో విడివిడిగా సమావేశమయ్యారు. వారిద్దరూ డా. బూర నర్సయ్య గౌడ్‌ను, ఆయనతో పాటు వచ్చినవారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పథకాలు.. ప్రయోజనాలు ఒక కుటుంబానికే పరిమితం: భూపేంద్ర యాదవ్, కేంద్ర మంత్రి
బూర నర్సయ్య గౌడ్ చేరిక సందర్భంగా వేదిక మీద మాట్లాడిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించారు. తెలంగాణలో పథకాలు, ప్రయోజనాలు కేవలం ఒక్క కుటుంబానికి పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. పదవులైనా.. మరేదైనా ఆ కుటుంబాన్ని దాటి బయటకు రాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేవలం అవినీతి మాత్రమే కాదు, అహంకారం, నిరంకుశత్వంతో కూడిన ప్రభుత్వం ఉందని ఆరోపించారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన విధానం చూస్తేనే ముఖ్యమంత్రి తీరేంటో తెలిసిపోతుందని అన్నారు. వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన డా. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందో, అది నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మైనారిటీల మెప్పు కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. మిగతా వర్గాలకు ఏ ఒక్క ప్రయోజనం అందడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తీరుపై తెలంగాణ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారేనని భూపేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు.

బానిసత్వ పరీక్షలో ఫెయిలయ్యా: బూర నర్సయ్య
తెలంగాణ రాష్ట్ర సమితిలో అవమానాలు హద్దు దాటాయని, బానిసత్వానికి పరీక్ష పెట్టినట్టుగా పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆత్మాభిమానం కలిగిన తాను బానిసత్వ పరీక్షలో ఫెయిలయ్యానేమో అని వ్యాఖ్యానించారు. బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ కొందరిది కాదు, అందరిది అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం, మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిని కలిసి రెండు, మూడేళ్లయిందని అన్నారు. ధర్మ దర్శనం లేదు, కనీసం వీఐపీ బ్రేక్ దర్శనం కూడా లేకపోయిందని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ బీజేపీలో అన్ని వర్గాలకు అవకాశాలు దక్కుతాయని, ఒక పోస్టర్ బాయ్ ప్రధాన మంత్రి కావొచ్చని, ఆఫీస్‌లో పనిచేసేవాడు కేంద్ర మంత్రి కావొచ్చని అన్నారు. ఇలాంటి అవకాశాల కంటే.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం ఉంటుందని, అందుకే తాను బీజేపీలో చేరానని తెలిపారు. తన నిజాయితీని, చిత్తశుద్ధిని తెలుసుకుని బీజేపీ నేతలు పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని చెప్పారు.

- Advertisement -

బీజేపీలో ఏ పదవి, టికెట్ ఆశించకుండా చేరానని, ఇందుకు తనను పార్టీ నాయకత్వం ప్రశసించిందని అన్నారు. ఆశించకుండా పనిచేసేవారికి బీజేపీలో విస్తృతావకాశాలు ఉంటాయని బీజేపీ నాయకత్వం తనతో చెప్పిందని అన్నారు. తాను పని సృష్టించుకునే తత్వం కల్గినవాడినని, పనిచేసే అవకాశం వస్తే చాలని అనుకుంటానని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీజేపీతో సిద్ధాంతపరంగా కూడా ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. బీజేపీ అంటే అదేమీ విదేశీ జనతా పార్టీ కాదని, ఏం చేసినా దేశహితం కోసమే చేస్తుందని అన్నారు. అంతకు మించిన మంచి సిద్ధాంతం, భావజాలం ఇంకేమి ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement