Monday, April 29, 2024

ఇప్పట్లో ముగియదు.. ఏళ్లపాటు కొనసాగే పరిస్థితులు : నాటో

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం హోరాహోరీగా సాగుతూ కీలకదశకు చేరుకుందని, ఇది కొన్నేళ్లపాటు కొనసాగేలా పరిస్థితులు మారిపోతున్నాయని, ఇప్పటికిప్పుడు యుద్ధం ముగుస్తుందని భావించలేమని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు మరింత సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని పశ్చిమ దేశాలకు సూచించారు. జర్మనీకి చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీర్ఘకాలంపాటు యుద్ధం కొనసాగితే అది ఐరోపాసహా ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపిస్తుందని, ఆహార, ఇంధన సంక్షోభం తప్పదని, ఇతర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆయుధ సహకారం అందిస్తే చాలదని, ఆహారం, ఔషధాలు సహా మిగతా అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని స్టోలెన్‌ బర్గ్‌ సూచించారు. ప్రస్తుత డోన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా దూకుడూగా వెడుతోందని, కళ్లెం వేయాలంటే కీవ్‌కు మరింత ఆయుధ సహకారం అందించాలని అభిప్రాయపడ్డారు. దాదాపు అదే అభిప్రాయాన్ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా వెల్లడించారు. రష్యా దండయాత్ర మొదలైనప్పటికంటే ఇప్పుడు ఉక్రెయిన్‌ రాటుదేలిందని, యుద్ధ వ్యూహాలను రచించడంలోను, వేగంగా అమలు చేయడంలోను నైపుణ్యం సాధించిందని, పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధాలను సమర్థంగా ఉపయోగిస్తోందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల రోజురోజుకూ బలపడుతున్న ఉక్రెయిన్‌ రష్యాను గట్టిగానే నిలువరిస్తోందన్న ఆయన, రష్యా సేనలకన్నా ఉక్రెయిన్‌ సేనలు అతివేగంగా కొత్త అంశాలపై పట్టు సాధించి ఎదురుదాడి చేయవలసిన అవసరం ఉందని అన్నారు.

ఓ విదేశీ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలను పేర్కొంటూ కీవ్‌ సేనలు రష్యాకు లొంగిపోతాయనుకోవడం భ్రమేనని, అందువల్ల ఈ యుద్దం కొన్నేళ్లపాటు సాగక తప్పదని, యుద్ధం వేగంగా ముగియాలంటే ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సంపూర్ణ మద్దతు, ఆయుధ సంపత్తిని స్థిరంగా అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రష్యాను తరిమికొట్టాలంటే మరింత వేగంగా ఉక్రెయిన్‌ సేనలు యుద్ధ నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని సూచించారు. అందుకువీలుగా వారికి మిత్రదేశాలు తగినస్థాయిలో నిధులు, ఆయుధాలు, సాంకేతిక సాయం సుదీర్ఘకాలంపాటు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ భీకర పోరాటం కొన్నేళ్లపాటు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆహారభద్రతకు ముప్పు తప్పదని, ఇంధన కొరత ఏర్పడి తీరుతుందని, ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ దురాక్రమణవల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతుందన్న ఆయన యుద్ధం వేగంగా ముగియాలంటే ఉక్రెయిన్‌ విజయం సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. కాగా యుద్ధం ఎంతకాలం సాగినప్పటికీ కీవ్‌ను ఒంటరిగా వదిలేయబోమని, విజయం సాధించేవరకు అవసరమైన సాంకేతిక, ఆయుధ సహకారం అందించి తీరుతామని జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రతిన పూనారు. ఇదే విషయాన్ని వచ్చేవారం ఎల్‌మౌలోని బెవారియన్‌లో జరగనున్న జి-7 భేటీలో ప్రస్తావిస్తానని చెప్పారు. సుదీర్ఘకాలంపాటు ఉక్రెయిన్‌కు సాంకేతిక, ఆయుధ, మానవతా సాయం అందించే అంశంపై చర్చిస్తామని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement