Friday, March 29, 2024

వానలు లేట్​ అయితే పంటలపై ప్రభావం.. వడగాలులతో యాసంగి, వర్షాలతో వానాకాలం పంటలకు దెబ్బ

వాతావరణ పరిస్తితులు అనుకూలించకపోవడంతో భారత వ్యవసాయ రంగం కుదుపునకు గురవుతూనే ఉంది. ఈ ఏడాది తీవ్రమైన వడగాల్పులతో రబీ సేద్యం దెబ్బతినడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఇక నైరుతి రుతుపవనాలపై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఇప్పటివరకు ఆశించిన రీతిలో వర్షాలు కురియడం లేదు. ఈసారి రుతుపువనాలు ఒక రోజు ముందుగానే దేశంలోకి ప్రవేశించినప్పటికీ చురుకుగా కదలడం లేదు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయానుబంధ ఆర్థిక రంగంపై పెను ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాలు బాగా కురిస్తే వ్యవసాయ దిగుబడులు పుంజుకుంటాయి. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం సమస్య ఉత్పన్నంకాదు. కానీ ప్రస్తుతం రుతుపవనాలు మందగమనం భయపెడుతోంది. మనదేశంలో రుతుపవనాల సమయంలో70 శాతం వర్షపాతం ఆధారంగా 60 శాతం సేద్యయోగ్య భూముల్లో సాగుబడి జరుగుతోంది. దేశ జనాభాలో సగానికి సగం మంది ప్రత్యక్షంగాను, పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. ఈసారి వడగాల్పుల తీవ్రత వల్ల రబీ పంటలు దెబ్బతిన్నాయి. 5 శాతం మేర అంటే 111.3 మిలియన్‌ టన్నుల మేర దిగుబడి తగ్గిపోతుందని అంచనా. అందువల్లే గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వరుసగా నాలుగో ఏడాది, అంటే ఈసారి కూడా సాధారణ వర్షపాతమే నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు మొదలైన తరువాత వేగం పుంజుకోలేదని, అయితే భయపడాల్సిన అవసరం లేదని, మునుముందు చురుకుగా కదులుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.

అయితే, వర్షాలు ఆలస్యమయ్యేకొద్దీ వరి, గోధుమ వంటి పంటల సాగుకు నష్టం జరుగుతుంది. దేశం మొత్తంమీద జూన్‌ 11నాటికి వర్షపాతం సాధారణంకన్నా 43శాతం తక్కువగా నమోదైందని, అయితే ఆ తరువాత వర్షాలు కాస్త పెరిగాయని, లోటు 18 శాతంగానే నమోదైందని భారత వాతావరణ శాఖ డైరక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. జూన్‌ 23 తరువాత రుతుపవనాల చురుకుగా కదులుతాయని, దేశమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు. అయితే రుతుపవనాలు ఎప్పుడూ దేశమంతటా ఒకేలా ఉండవని, వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివిధ రీతుల్లో ఉంటుందని చెప్పారు. లేనినో వంటి పరిణామాలు రుతుపవనాలకు అనుకూలమేనని, అయితే హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ద్విధ్రువ పరిస్థితులవల్ల రుతుపవనాల కదలిక మందగించిందని పేర్కొన్నారు. అయితే, నైరుతి రుతుపవనాల కదలికకు ప్రతిష్ఠంభన ఏర్పడిందని స్కైమాట్‌ వెల్లడించింది. వ్యవసాయానికి సంబంధించినంతవరకు సగటు వర్షపాతం కన్నా తక్కువగానే నమోదైందని తెలిపారు.

పశ్చిమబెంగాల్‌, ఒడిశా, బంగ్లాదేశ్‌, గంగానదీ పరీవాహక మైదానాల్లోను వచ్చే రెండుమూడు రోజుల్లో పరిస్థితులు మెరుగై భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సైక్లోనిక్‌ సర్క్యులేషన్‌ పరిణామం వల్ల మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌, ఝార్కండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ ప్రాంతాల్లో వ్యవసాయానికి నైరుతి రుతుపవనాలే కీలకం. అందుకేవారు వర్షాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాగా పంజాబ్‌, హర్యానాల్లో మాత్రం రైతులు వీటిపై ఆధారపడరు. అక్కడి రైతులు నీటిపారుదల వ్యవస్థలు, బావులు, కాల్వలపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు. రుతుపవనాల జాప్యంవల్ల మహారాష్ట్రలోని కీలకమైన కొంకణ్‌-విదర్భ ప్రాంతంలో వ్యవసాయం దెబ్బతింటుంది. అయితే జూన్‌ నెలాఖరుకు పరిస్థితులు మెరుగవుతాయని, పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శర్మ వెల్లడించారు. జూన్‌ చివరి నుంచి జులై నెలంతా భారీ వర్షాలు కురుస్తాయని, లోటు పూడుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త వినోద్‌ సెహ్‌గల్‌ తెలిపారు. ఒకవేళ వర్షాలు సరిగ్గా కురవకపోతే ఖరీఫ్‌ బాగా దెబ్బతింటుందని, అయితే ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వడగాల్పులతో నేలంతా తేమను కోల్పోయిన నేపథ్యంలో భారీ వర్షాలు అవసరమన్న ఆయన ఆహార ద్రవ్యోల్బణం ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచమంతటా నెలకొంటోందని, వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు దీనికి కారణమని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement