Thursday, May 9, 2024

నేతలే కాదు, పార్టీ ఓటుబ్యాంకే తరలిపోతోంది.. అధిష్టానం పెద్దల వద్ద టీ-కాంగ్రెస్ నేతల ఆవేదన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను విడివిడిగా కలిసిన పలువురు టీ-కాంగ్రెస్ నేతలు, బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండి పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ సహా పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. పార్టీ పెద్దలను కలిసిన నేతల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు మహేశ్వర్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఉమేశ్ రావు, అహ్మతుల్లా తదితరులున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై కొందరు నేతలు అధిష్టానం పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కొందరు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేయగా, మరికొందరు నేతలు మాత్రం నేరుగా ఆయనపై ఫిర్యాదు చేయకుండా పార్టీ పరిస్థితిపై ఫీడ్‌బ్యాక్ అందజేసినట్టు సమాచారం.

కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలకు వెళ్లినా వచ్చే నష్టం ఏమీ లేదని, ఆ స్థానంలో మరొక పార్టీ కార్యకర్తకు అవకాశం ఇవ్వొచ్చని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఓటర్లే పార్టీని వీడి ఇతర పార్టీలకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలనే వారు ఇందుకు ఊదాహరణగా చూపారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 వేల ఓట్లకే పరిమితమై డిపాజిట్ కోల్పోవడం నుంచి మొదలుపెట్టి, ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లోనూ పట్టున్న కాంగ్రెస్ పార్టీ పాతికవేల లోపు ఓట్లకు పరిమితం కావడంపై ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధిష్టానం దృష్టి పెట్టాలని, లేదంటే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని చెప్పినట్టుగా తెలిసింది.

మునుగోడుపై నివేదిక ఇచ్చా: రాంరెడ్డి దామోదర్ రెడ్డి
ఓవైపు అధిష్టానం నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల మంతనాలు సాగుతుండగా.. మరోవైపు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బుధవారం సాయంత్రం కలిశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించానని చెప్పారు. పార్టీని పటిష్టం చేయడం కోసం ఏం చేస్తే బావుంటుందనే అంశాలపై చర్చించానని, అలాగే మునుగోడు ఉప-ఎన్నికలకు ఇంచార్జిగా పనిచేసిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఒక నివేదికను ఖర్గేకు అందజేశానని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ చేసిన ప్రయత్నం, లోపాలు, బలహీనతలు, ఓటమికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదిక అందజేసినట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు గెలుపు కోసం మైక్రో మేనేజ్మెంట్ చేసి చాలా కృషి చేసిందని కితాబిచ్చారు. ఇక టీపీసీసీ కొత్త కార్యవర్గం కూర్పుపై ప్రశ్నించగా.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జులు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా అధిష్టానం పదవులు, బాధ్యతలు అప్పగిస్తుందని దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement