Friday, April 26, 2024

పోలీస్‌ నియామకాల్లో గర్భిణులకు నో ఫిజికల్‌ టెస్ట్‌.. మెయిన్స్‌కు నేరుగా వెళ్లొచ్చు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పోలీస్‌ నియామకాల్లో గర్భిణీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురునందించింది. ఫిజికల్‌ టెస్టులనుంచి వారికి మినహాయింపునిస్తూ ఆదేశాలు వెల్లడించింది. దేహదారుఢ్య పరీక్షలో గర్భిణీలకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనకుండానే తుది అర్హత పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుది అర్హత పరీక్ష పాసైన నెలలోపు.. దేహదారుఢ్య పరీక్షలో పాల్గొని అందులోనూ అర్హత సాధిస్తేనే వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్‌ నియామక బోర్డు అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ మినహాయింపులనిచ్చిన ప్రభుత్వం గర్భీణీ అభ్యర్ధులకు కొన్ని షరతులు విధించింది.

పోలీస్‌ ఉద్యోగ నియామకాలు కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో గర్భిణీలకు మినహాయింపునిస్తున్నట్లు పోలీస్‌ నియామక మండలి అధికారులు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల కోసం గర్భిణీ అభ్యర్థులు నిబంధనలను అంగీకరిస్తున్నట్లు లేఖ రాసివ్వాలని పోలీసు నియామక మండలి అధికారులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు గర్భిణీలకు ఈ మినహాయింపు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ప్రస్తుతం 9 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో ఇప్పటికే ముగిశాయి. దేహదారుఢ్య పరీక్షలు గతంతో పోలిస్తే కాస్త సులభతరమయ్యాయని.. 70శాతానికి పైగా అభ్యర్థులు అర్హత సాధిస్తున్నారని అధికారులు వెల్లడించారు. మరో 10రోజుల్లో దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement