Tuesday, April 30, 2024

నో ఎంట్రీ టూ తెలంగాణ.. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో రాష్ట్రంలో వెలుస్తున్న ఫ్లెక్సీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణకు ప్రధాని మోడీ రాక నేపథ్యంలో విచిత్రం చోటుచేసుకున్నది. ఆయన రాకను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నో ఎంట్రీ టూ తెలంగాణ అంటూ హైదరాబాద్‌లోని పలు రహదారులు, కూడళ్లలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట వంటి ప్రధాన కూడళ్లు, రహదారులపై ఈ విధంగా ఫ్లెక్సీలు ప్రయాణీకులను, ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. దేశస్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన చేనేతరంగాన్ని కుఉదేలుచేసి, ఈ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్మికుల పొట్టగొట్టేలా 5శాతం జీఎస్టీ విధింపుపై ప్రధాని మోడీని ప్రశ్నించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాకను నిరసిస్తూ పలు ప్రజా, విద్యార్ధి, యువజన, మహిళా సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. వీరికి మద్దతుగా చేనేత యూత్‌ ఫోర్స్‌ పేరుతో ప్రధానిగారూ మా రాష్ట్రానికి రాకండి అటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం.

ఈ అంశం తాజాగా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా సోసల్‌ మీడియాలో కూడా హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా హోరెత్తించాయి. దీంతో అన్ని వర్గాలు కేంద్ర ప్రభుత్వ పాలనా తీరుతెన్నులు, పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న రూపాయి విలువ, ద్రవ్యోల్భణం పెరుగుదల, నిరుద్యోగిత రేటు, ఆహార సంక్షోభ స్థితిగతులపై ఆలోచనలు రేకెత్తించేలా కనిపించాయి. ఇవి కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవసాయరంగం తర్వాత అత్యధికమంది ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగంపై ప్రధాని మోడీ సర్కార్‌ నిర్లక్ష్య వైఖరితోనే ఎనిమిదేళ్లలో చేనేతరంగంపై ఆధారపడిన ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు బీజేపీయేతర పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.

ఇక రాష్ట్రర్లో ప్రధాని మోడీ పర్యటించిన ప్రతీసారి విభజన హామీల అమలుపై డిమాండ్లు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఆర్ధిక ఆంక్షలు తప్పా ఎటువంటి విభజన హామీల అమలు ఊసే లేదు. దీంతో ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరనుగున్నదనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. విద్య, వైద్యం, ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు తదితర కేటాయింపుల్లో నిర్లక్ష్యం తెలంగాణకు శాపంగా మారుతోంది. కాఈపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పారిశ్రామిక రాయితీలు, ఐటీఐఆర్‌ రద్దుతో తెలంగాణకు కేంద్రం చేసిన మోసాలపై తెలంగాణ సమాజం కోపంతో రగిలిపోతున్నదని మేధావుల వాదనగా ఉంది. దేశంలో 22 సాఫ్ట్‌వేర్‌ పార్కులను ప్రకటింటిచిన కేంద్రం తెలంగాణకు రిక్త హస్తం చూపడంతోపాటు, ఆర్ధిక సాయాల్లో కోతలు, దామాషాగా, హక్కుగా దక్కాల్సిన ఆర్ధిక నిధుల్లోనూ నిర్లక్ష్యం కేంద్ర పాలనకు అద్దం పడుతోంది. ఐఐఎంలు, ట్రిపుల్‌ ఐటీలు, మెడికల్‌ కాలేజీలు, నవోదయా పాఠశాలలు ఏర్పాటు వంటి వాటిలో చేసిన మోసాలతోపాటు, చివరకు తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు కూడా కేంద్రం మోకాలడ్డటం ఈ సందర్భంగా చర్చకు వస్తున్నది.

దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యలకు కేంద్రం పూనుకోవాలని, గవర్నర్లను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఉసిగొలిపి పాలనకు ఆటంకంగా మారి ప్రజలకు ఇబ్బందులు సృష్టించొద్దనే నినాదాలతో ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ బీజేపీ వైఫల్యాలను ఎండగడుతున్న పరిస్థితి నెలకొంఒది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతోపాటు, సీబీఐ, ఐటీ, ఈడీలను తెలంగాణ నేతలపై ఉసిగొలిపి వేదిస్తున్న అంశం కూడా ప్రజలు ఆశక్తితో గమనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement