Sunday, May 19, 2024

బాల్య వివాహాలపై చ‌ర్య‌లేవీ.. ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని అధికారులు

శంషాబాద్‌, (ప్రభ న్యూస్‌): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, అది ఒక సామాజిక సాంఘిక దురాచారం. అభం శుభం ఎరుగని ఆడ పిల్లల జీవిత ఎదుగుదలకు అవరోధం. నిండు జీవితాలు ఎండ మావిగా మారుతున్న వైనం. అందుకే బాల్య వివాహాలు చేయకూడదని ఎన్నో పోరాటాల ఫలితంగా చట్టం చేసి అమల్లోకి తీసుకువచ్చారు. ఎంతో దూరదృష్టితో తీసుకువచ్చిన బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సంబంధిత అధికారులు తుంగలో తొక్కుతూ అక్రమార్కులతో చేతులు కలుపుతూ ఉండడంతో బాల్యవివాహాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా జరిగిపోతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు సహకరించకపోవడం వల్ల స్థానికంగా ఏర్పడే ఒత్తిడులను తట్టుకోవడంలో కిందస్థాయి సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. శంషాబాద్‌ మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో బాల్య వివాహాలు జోరందుకున్నాయి. ఇటీవల కాలంలోనే నాలుగైదు బాల్య వివాహాలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. బాల్య వివాహాం జరుగుతుందన్న సమాచారం మేరకు కొంత మంది రహస్యంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు, షీటీమ్స్‌, పోలీస్‌ అధికారులు వచ్చి వాళ్ల చేత లెటర్‌ రాయించికుని మళ్ళీచూడకుండా వెళ్లిపోతున్నారు. పదిరోజులు వేచి చూసిన పెళ్లి పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు పూర్తి చేస్తున్నారు. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం అనే విషయాన్ని అధికారులు మర్చిపోతున్నారు.

బాల్య వివాహాం జరుగుతుందన్న విషయం తెలిస్తే అక్కడికి వెళ్లి వాళ్ల వయస్సు పరిమితిని గుర్తించి ఒక వేళ వయసు తక్కువగా ఉంటే ఆ కుటుంబానికి కౌన్సిలింగ్‌ ఇచ్చి నిర్ణీత వయసు వచ్చే వరకు పెండ్లి చేయకుండా తగుచర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు వారి బంధువులు ఏ రకమైన ప్రలోభాలకు గురి చేసిన అధికారులు బాల్య వివాహాల నివారణకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆనీ క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదు. సంబంధనల ప్రకారం పూజరులు సైతం బాల్య వివాహాలు జరపడానికి వీలు లేదు అయినప్పటికీ బాల్య వివాహాలు అని తెలిసినా పెళ్లి తుంతు కానిచ్చేస్తున్నారు. పీహెచ్‌సీలలో వైద్యపరీక్షల కోసం వచ్చే వారిలో 20 శాతం వివాహ వయసు నిండా లేకుండా పెళ్లి చేసుకొని వచ్చిన వారే ఉంటున్నారు. లంచాలకు కక్కుర్తి పడుతున్న అధికారుల వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని గ్రామాల్లో జరుగుతున్న బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. బాల్య వివాహం అని తెలిసి పట్టించుకోకుండా ఉన్న సంబంధిత శాఖల అధికారులు, కుటుంబ సభ్యులు, పూజారులతో సహా సహకరించిన అందరిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement