Saturday, May 18, 2024

న్యూ ఇయర్‌ జోష్, ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు.. తొలుత ఓషినియాలో ప్రారంభం

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ సంబరాలు అంబురాన్నంటాయి. 2022కు గుడ్‌ బై చెప్పి.. 2023 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం చెప్పారు. అందరికంటే ముందుగా ఓషియానియా న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పేసింది. ప్రపంచంలోని కొత్త సంవత్సరం ముందుగా ఓషినియాలో ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ న్యూ ఇయర్‌ ప్రారంభమైంది. చిన్న పసిఫిక్‌ ద్వీప దేశాలు టోంగా, కిరిబాటి, సమోవాలు కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. ఇక, న్యూజిలాండ్‌ కూడా కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30గంటలకు న్యూజిలాండ్‌ కొత్త ఏడాదిని స్వాగతించింది.

ఆనందోత్సాహాల మధ్య కివీస్‌ ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్‌ నగరం మెరిసిపోయింది. బాణసంచా వెలుగులతో స్కైటవర్‌ వర్ణ రంజితమైంది. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరుపుకున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా చాలా దేశాలలోని పరిమితంగానే న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. అయితే ప్రస్తుతం చాలా దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదు. దీంతో రెండేళ్ల తర్వాత గ్రాండ్‌గా న్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు.

- Advertisement -

ఏయే దేశాల్లో ఎప్పుడు..

  • ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు నూతన సంవత్సరం మొదలవుతుంది.
  • ఇక సూర్యోదయ భూమిగా పేరున్న జపాన్‌ కూడా మూడున్నర గంటల ముందే 2023లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భారత్‌ పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.

ఒకేసారి 43 దేశాల్లో..

సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2023లోకి అడుగుపెడతాం. అదే సమయానికి భారత్‌తో పాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.

చివరగా అక్కడే..

భారత్‌ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. ఇక కొత్త సంవత్సరం ఆఖరిగా వచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని బేకర్‌, హోవార్డ్‌ దీవులు. అయితే ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అమెరికన్‌ సమోవాను చివరిదిగా పరిగణిస్తారు.

ఇవి ప్రత్యేకం..

రష్యాలో నూతన సంవత్సర వేడుకలను రెండుసార్లు జరుపుకొంటారు. ఒకటి జనవరి 1 (కొత్త క్యాలెండర్‌ ప్రకారం). రెండోది జనవరి 14 (పాత జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం). ఇక నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోని దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, వియత్నాం ఉన్నాయి. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్‌ వేడుకలు జరుగుతాయి.

చెప్పాలంటే ఈ సంవత్సరం కూడా ప్రపంచాన్ని కొవిడ్ భయాలు పూర్తిగా వీడలేదు. చైనాలో కొత్త వేరియంట్లు ఉద్ధృతి చూపిస్తున్నాయి. జపాన్‌, అమెరికా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. దాంతో పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement