Friday, May 3, 2024

Spl Story: ‘కారు’కు నేషనల్​ పర్మిట్​.. ఏపీ నుంచే విస్తరణకు కేసీఆర్​ వ్యూహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు భారతీయ రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీని ఏర్పాటు చేయనున్న టీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పార్టీ విస్తరణ ప్రక్రియను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 19న తెలంగాణ భవన్‌లో రోజంతా ఏర్పాటు చేసే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించి తర్వాత వారం నుంచి పది రోజులపాటు ఢిల్లిలో మకాం వేయాలని ఆయన ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లి పర్యటన ముగించుకుని వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి పార్టీ విస్తరణకు ప్రణాళిక రూపొందించాలని ఆయన సంకల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీలైతే ఈనెల చివరి వారంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు సిద్ధం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఆయన ఇప్పటికే ఏపీలో ఉన్న తన మిత్రులతో సమాలోచనలు జరిపినట్టు చెబుతున్నారు.

భారతీయ రాష్ట్ర సమితిని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణ ప్రక్రియ చేపట్టాక ఉత్తరాది రాష్ట్రాలపై దృష్టి సారించాలని కేసీఆర్‌ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి (పాండిచేరి) రాష్ట్రాల్లో తొలుత పర్యటించి జాతీయ పార్టీ ఏర్పాటుపై ఆయా రాష్ట్రాల రాజధానుల్లో మీడియా సమావేశాలు నిర్వహించి పార్టీ పెట్టడానికిగల ముఖ్య ఉద్దేశాలను వివరించాలని కేసీఆర్‌ ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు, సమాలోచనలు జరిపిన కేసీఆర్‌ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బాజపాలకు వ్యతిరేకంగా పార్టీ పెడుతున్న అంశాన్ని చెప్పినట్టు తెరాస ముఖ్య నేత ఒకరు చెప్పారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంలో చేపట్టాల్సిన ప్రక్రియను ముగించిన తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసే బాధ్యతలను ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది.

ఏపీ గడ్డ మీద గులాబీ గుబాళించేలా కార్యాచరణ
భారతీయ రాష్ట్రీయ సమితిని ఆంధ్రప్రదేశ్‌ గడ్డ మీద గుబాళించేలా కార్యాచరణ సిద్ధం చేసే పనిలో తెరాస సీనియర్లు నిమగ్నమయ్యారు. ప్రగతి భవన్‌లో ఆదివారం ఏపీకి చెందిన రాజమండ్రి లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో ఐదు గంటలకుపైగా ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ చర్చోపచర్చలు సాగించారు. మధ్యాహ్న భోజనం చేసిన ఇరువురు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి జాతీయ పార్టీ విస్తరణపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా కేసీఆర్‌ ప్రారంభించనున్న జాతీయ పార్టీపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ విపరీతమైన చర్చ జరుగుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఏపీలో పార్టీని విస్తరిస్తే ఆ రాష్ట్రంలో కేసీఆర్‌తో కలిసొచ్చే పార్టీలు, నేతల జాబితాను సిద్ధం చేసే పనిలో తెరాస వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటుపై తెరాస సోషల్‌ మీడియా కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంత మంది ముఖ్యులతో టెలిఫోన్‌ మంతనాలు జరిపి ఆ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు కేసీఆర్‌ చేపట్టిన జాతీయ పార్టీకి సంబంధించి అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించే ఆలోచన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో జరిగిన సుదీర్ఘ భేటీలో సీఎం కేసీఆర్‌ ఉండవల్లితో ఏయే అంశాలు చర్చించి ఉంటారన్న అంశాలపై ఆ రాష్ట్రంలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. కాగా ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు రాజమండ్రిలో మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఇందులో కేసీఆర్‌తో కలిసి తాను జరిపిన చర్చల సారాంశాన్ని, ఆయన పెడుతున్న జాతీయ రాజకీయ పార్టీ బీఆర్‌ఎస్‌కు సంబంధించిన అంశాలను వివరించే సూచనలు కనిపిస్తున్నాయని ఉండవల్లి సన్నిహితులు చెప్పారు.

- Advertisement -

అసంతృప్త నేతలకు గాలం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌, విపక్ష పార్టీ తెదేపాల మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల్లో ఉన్న లుకలుకలను తమకు అనుకూలంగా మల్చుకుని ఆయా పార్టీల నేతలకు గాలం వేయాలన్న ప్రతిపాదనపై ఆదివారం నాటి సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. మరో రెండేళ్లలో అసెంబ్లిd ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని అధికార పార్టీలో అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఇటీవల ఆయా నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలను వివరించిన ఉండవల్లి ఈ తరహా నాయకులను తిప్పుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పినట్టు సమాచారం.

ఇందుకు ఉదాహరణగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన నేతల సమాచారాన్ని ఉండవల్లి కేసీఆర్‌కు వివరించినట్టు సమాచారం. విశాఖపట్టణం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల మధ్య రగులుతున్న విభేదాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం.

ఏపీలో కేసీఆర్‌కు అభిమానుల వెల్లువ
తెలుగుదేశం పార్టీలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో అభిమానించే నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని తెరాస అంటోంది. ప్రతి పండుగలకు ఏపీలోని భీమవరం, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో కేసీఆర్‌ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి శుభాకాంక్షలను చెప్పడం ఆనవాయితీగా వస్తోంది.

2014లో రాష్ట్రం విడిపోయాక జరిగిన మొదటి ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం, అమరావతిలో రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపనకు చంద్రబాబు ఆహ్వానంతో కేసీఆర్‌ వెళ్లిన సందర్భంలోనూ అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలోని కనక దుర్మమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వెళ్లిన సందర్భంలోనూ ప్రజలు నీరాజనం పలికారు. విశాఖ వెళ్లి శారదపీఠాధిపతిని, తిరుమల వెళ్లి దేవదేవుడిని దర్శించుకున్న సందర్భంలోనూ ప్రజలు తమ అభిమానాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీలోని తాను ప్రతిపాదించిన జాతీయ పార్టీ విజయవంతమవుతుందన్న ధీమాతో సీఎం కేసీఆర్‌ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement