Sunday, April 28, 2024

Cyclone – పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు ఎక‌రానికి 20 వేలు సాయం అందించండి..నాదేండ్ల మ‌నోహ‌ర్

తెనాలి, డిసెంబర్ 5 ప్రభా న్యూస్ : మిగ్ జామ్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ . తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకి రూ. 20 వేల చొప్పున తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వదిలి రైతాంగాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు. ఫసల్ బీమా పథకం చెల్లించని నిర్లక్ష్య వైఖరికి, అసమర్ధతకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కోరారు. ప్రతి గింజను కొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 2 కోట్ల సాయం ఏ విధంగానూ చాలదన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు భరోసా నింపే విధంగా జనసేన పార్టీ నిలబడుతుందని తెలిపారు.

మంగళవారం తెనాలి కార్యాలయంలో తుపాను పరిస్థితులపై ఆయా జిల్లాల నాయకులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “అతి తీవ్రమైన తుపాను మిగ్ జామ్ బాపట్ల వద్ద తీరం దాటింది. రెండు మూడు గంటల పాటు భూతలం మీద కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు ఏడు జిల్లాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. రైతులకు నష్టం కలిగించే విధంగా, సామాన్యులకు ఇబ్బంది కలిగించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం నీరందించలేని పరిస్థితుల్లో సొంతంగా మోటర్లు పెట్టుకుని రైతులు కష్టపడి పంటలు కాపాడుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు రావడం బాధ కలిగిస్తోంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో నష్టపోయిన రైతాంగానికి మా జనసైనికులు, నాయకులు అండగా నిలిచి సహకారం అందిస్తారు.రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకుండా రైతుకి నష్టం కలిగించారు
తెనాలి మండలంలో 15 వేల ఎకరాలు, కొల్లిపర మండలంలో 18 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. తుపాను ప్రకటనలతో రాత్రింబవళ్లు కష్టపడి కొంత మంది కోతలు పూర్తి చేశారు. అయితే అది పది శాతం కూడా మించలేదు. కోతలు పూర్తయిన 10 శాతంలో ఎంత మంది మిల్లర్లకు అమ్ముకున్నారో కూడా చెప్పలేము. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకానికి రాష్ట్రం వాటా చెల్లించకుండా రైతుల్ని ముంచింది. రైతులకు మేమే కడతామని చెప్పి మరీ అపార నష్టం కలిగించారు. గత రెండేళ్లు బీమా కింద కేంద్రం సుమారు రూ. 1100 కోట్లకు పైగా పరిహారం చెల్లించింది. ఈ ఏడాది రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో బీమా వర్తించదని తేల్చేసింది. రైతులకు ఫసల్ బీమా పథకం వర్తించకుండా చేసిన అజ్ఞాని ముఖ్యమంత్రి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేవలం 16 మంది రైతులకు మాత్రమే బీమా వర్తించింది. ఇంత నష్టం వాటిల్లినప్పుడు బీమా కట్టకపోతే రైతాంగం ఏమైపోతారు.ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.. కరవు మండలాల ప్రకటన వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. ఏడు జిల్లాల్లో 465 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 103 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించింది. ప్రభుత్వ చర్యలు రైతాంగానికి అపార నష్టం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి ముఖ్యమంత్రి కచ్చితంగా బాధ్యత వహించాలి. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, రైతులకు న్యాయం జరిగే ఏర్పాటు చేయాలి” అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ నేతలు బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, హరిదాసు గౌరీశంకర్, యెర్రు వెంకయ్య నాయుడు, దివ్వెల మధుబాబు, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement