Friday, May 3, 2024

Cricket | ఎంఎస్‌డీసీఏ స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ కౌంట్‌డౌన్ షురూ.. టీ20 లీగ్ రిజిస్ట్రేష‌న్స్ ప్రారంభం!

మ‌హేంద్ర సింగ్‌ ధోనీ క్రికెట్ అకాడ‌మీ (ఎంఎస్‌డీసీఏ) స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌-1 టీ20 లీగ్ నిర్వ‌హ‌ణ‌కు రంగం సిద్ధ‌మైంది. ఎంఎస్‌డీసీఏ, బ్రైనియాక్స్ బీ, ప‌ల్ల‌వి ఫౌండేష‌న్ స‌హ‌కారంతో స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌-1ను నిర్వ‌హిస్తున్న‌ట్టు నాచారంలోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లోని ఎంఎస్‌డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంట‌ర్‌లో 7H స్పోర్ట్స్ సంస్థ డైరెక్ట‌ర్ బి.వెంక‌టేష్ ప్ర‌క‌టించారు. అనంత‌రం ప‌ల్ల‌వి, డీపీఎస్ (నాచారం) విద్యాసంస్థ‌ల సీఓఓ మ‌ల్కా య‌శ‌స్వీ మాట్లాడుతూ ప్ర‌తిభావంతులైన క్రికెట‌ర్ల‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడ‌మీ స్కూల్ లెవ‌ల్‌లో లీగ్‌ను నిర్వ‌హిస్తుండ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. టాలెంట‌డ్ క్రికెట‌ర్స్‌ సెలెక్ష‌న్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొని, లీగ్‌లో ఆడే అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవాల‌ని ఆయ‌న కోరారు. లీగ్‌లో అత్య‌ద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన టాప్ ఐదుగురు ప్లేయ‌ర్ల‌కు ప‌ల్ల‌వి ఫౌండేష‌న్ ద్వారా రూ.5 ల‌క్ష‌ల విలువ గ‌ల స్కాల‌ర్‌షిప్ అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఉచిత శిక్ష‌ణ‌..
అనంతరం ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క ఎంఎస్‌డీసీఏ అధీకృత భాగస్వామైన బ్రైనియాక్స్ బీ డైరెక్ట‌ర్ ర‌షీద్ బాషా మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల‌కు చెందిన టాలెంటెడ్ క్రికెట‌ర్ల‌ను అన్వేషించి, వారిని ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో ఏర్ప‌డిందే ఎంఎస్‌డీసీఏ అని చెప్పారు. బాలుర అండ‌ర్‌-14, బాలిక‌ల అండ‌ర్‌-16 కేట‌గిరీల్లో ఈ టీ20 స్కూల్ లీగ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. లీగ్‌లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన ఐదుగురు క్రికెట‌ర్ల‌కు ఆరు నెల‌లు పాటు హైద‌రాబాద్‌లోని ఎంఎస్‌డీసీఏ సెంట‌ర్ల‌లో ఎక్క‌డైనా ఉచిత శిక్ష‌ణ అందించ‌నున్న‌ట్టు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో బ‌లుసు ప్ర‌వీణ్‌, ఎంఎస్‌డీసీఏ సిబ్బంది పాల్గొన్నారు.

లీగ్ స్వ‌రూపం
ఈ టీ20 లీగ్‌లో మొత్తం ఎనిమిది జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఫ్రాంచైజీ టీమ్ మోడ‌ల్‌లో లీగ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. గురువారం నుంచి రిజిస్ట్రేష‌న్స్ ప్రారంభ‌మ‌య్యాయి. రిజిస్ట్రేష‌న్‌కు ఆఖ‌రి తేదీ ఆగ‌స్టు 17వ తేదీ. ఆగ‌స్టు 20వ తేదీన హైద‌రాబాద్‌లోని ఎంఎస్‌డీసీఏ సెంట‌ర్ల‌లో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌స్టు 25న టీమ్ పేర్లు ప్ర‌క‌ట‌న‌, ట్రోఫీ, జెర్సీ ఆవిష్క‌ర‌ణ చేయ‌నున్నారు. ఆగ‌స్టు 27న లీగ్ మ్యాచ్‌లు ఆరంభ‌మ‌వుతాయి. సెప్టెంబ‌రు 3న ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌, మ‌రిన్ని వివ‌రాల కొర‌కు 7396386214, 7618703508 నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement