Monday, May 20, 2024

పేదలపై ప్రభావం చూపుతున్న లేబర్ బడ్జెట్.. గ్రామీణాభివృద్ధి శాఖ జోక్యం చేసుకోవాలన్న ఎంపీ రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తగ్గిన లేబర్ బడ్జెట్ రాష్ట్రంలోని 40-50 లక్షల మంది పేద కార్మికులపై ప్రభావం చూపుతోందని, ఈ వ్యవహారంలో తక్షణమే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్షను బుధవారం ఆయన లోక్‌స‌భ‌లో 377 నిబంధ‌న కింద ప్ర‌త్యేకంగా‌ ప్ర‌స్తావించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన బియ్యాన్ని సేకరించకుండా చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. తాజాగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద తెలంగాణకు చెందిన పేద కూలీల వంతు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నరేగా కింద తెలంగాణకు లేబర్ బడ్జెట్‌లో కేంద్రం కోత విధించిందని దుయ్యబట్టారు. 2021-22లో తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యం లేని కార్మికులకు 14.27 కోట్ల వేతన ఉపాధిని కల్పించిందని, కానీ 2022-23 నాటికి తెలంగాణ ప్రభుత్వం 15 కోట్ల వేతన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసినప్పటికీ, దీనిని 10 కోట్ల రోజుల వేతన ఉపాధికి తగ్గించారని రంజిత్ రెడ్డి వివరించారు. ఇది తెలంగాణ ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోరిన విధంగా వేతన ఉద్యోగాల సంఖ్య ఇచ్చేలా చూడవలసిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement