Thursday, May 2, 2024

కుమారుడి క‌ళాశాల ఫీజు కోసం త‌ల్లి ప్రాణ త్యాగం …

చెన్నై – కొడుకు పెద్ద చదువులు చదవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఓ తల్లి తన ప్రాణాన్నే త్యాగం చేసింది. కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బుల్లేక, ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం కోసం బలవన్మరణానికి పాల్పడింది. వేగంగా దూసుకొస్తున్న బస్సుకు సడెన్ గా ఎదురెళ్లింది. బస్సు బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. తాను చనిపోయినా తన కొడుకు చదువు సాగితే చాలని ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని సేలంలో జరిగిన ఈ విషాద ఘటన అక్కడున్న సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.

వివ‌రాల‌లోకి వెళితే సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాపాతి (45) పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్త నుంచి విడిపోయి పిల్లలను ఒంటరిగా పెంచుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికురాలిగా తనకు వచ్చే వేతనం ఖర్చులకే సరిపోకపోవడంతో కొడుకు కాలేజీ ఫీజు కట్టడం పాపాతికి భారంగా మారింది. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాపాతి కొడుకు కాలేజీ ఫీజు కట్టడానికి అప్పు కోసం ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలోనే బస్సు కింద పడి చనిపోతే ప్రభుత్వం రూ.45 వేల నష్ట పరిహారం ఇస్తుందని ఎవరో పాపాతి తెలిపారు.

దీంతో కొడుకు ప్రయోజకుడిగా ఎదగాలని, అందుకు తను చనిపోవాలని తీవ్ర నిర్ణయం తీసుకుంది. రోడ్డు దాటుతున్నట్లు నటిస్తూ వేగంగా వస్తున్న బస్సుకు ఎదురువెళ్లింది. బస్సు ఢీ కొనడంతో రోడ్డు మీద ఎగిరిపడింది. తీవ్రగాయాల కారణంగా పాపాతి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బస్సు కింద పడడానికి పాపాతి రెండుసార్లు ప్రయత్నించింది. మొదటిసారి బస్సు కింద పడేందుకు ప్రయత్నించగా ఓ ద్విచక్ర వాహనం ఆమెను ఢీ కొట్టింది. తర్వాత కాసేపటికి మళ్లీ బస్సుకు ఎదురువెళ్లింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ విషాద ఘ‌ట‌న అంద‌రిలో క‌న్నీళ్లు తెప్పిస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement