Saturday, May 18, 2024

మోదీ రాష్ట్రంలో మోగిన ఎన్నికల నగారా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. డిసెంబర్ 1న తొలి విడత, డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పుడే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడిస్తారని భావించారు. 2012లో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికల తేదీలు ప్రకటించగా, 2017లో వేర్వేరుగా ఎన్నికల తేదీలను ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, ఎన్నికల ముందు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకే ఈసీ అలా వ్యవహరించిందని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆరోపించాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటిస్తున్న సందర్భంలో..మీడియా నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఆలస్యానికి ఎన్నోకారణాలున్నాయని చెప్పారు. మోర్బి ఘటన అందులో ఒకటి అని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల కమిషన్‌పై రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. “కొందరు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈసీ మాటల కంటే చేతలతోనే ఏంటో నిరూపిస్తుంది. ఈసీని విమర్శించే పార్టీలు ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందాయి. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతుంటాయి. ఎన్నికల్లో థర్డ్ అంపైర్ ఉండడు. కానీ అంతిమంగా ఫలితాలే సాక్ష్యంగా నిలుస్తాయి” అంటూ వ్యాఖ్యానించారు.

కీలక తేదీలు, మొదటి విడత :

నవంబర్ 5న నోటిఫికేషన్
మొదటి విడతలో 89 నియోజక వర్గాలు
నవంబర్ 14న నామినేషన్ల ప్రక్రియ
నవంబర్ 15న నామినేషన్ల పరిశీలన
నవంబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్ 1 న ఎన్నికలు

- Advertisement -

2వ విడత:

నవంబర్ 10న నోటిఫికేషన్
2వ విడతలో 93 స్థానాలకు ఎన్నికలు
నవంబర్ 17న నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన
నవంబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్ 5న ఎన్నికలు
డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు

గుజరాత్‌లోని 182 సీట్లకు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌ 77 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో ప్రస్తుతం బీజేపీ బలం 111కు పెరిగింది. అయితే ఇప్పుడు ఢిల్లీతో పాటు పంజాబ్ రాష్ట్రంలోనూ అధికారాన్ని సాధించి కొత్త ఉత్సాహంతో దూసుకెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చూస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇన్నాళ్లూగా ముఖాముఖి సాగుతున్న పోరుకాస్తా ముక్కోణపు పోటీగా మారనుంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడం, ముక్కోణపు పోటీ నెలకొనడం వంటి కారణాలతో ఈసారి జరగనున్న ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.

కంటైనర్ పోలింగ్ బూత్

దేశంలోనే తొలిసారిగా కదిలే పోలింగ్ స్టేషన్‌ను ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. కేవలం 217 మంది ఓటర్లున్న అలియాబెట్ గ్రామంలో 82 కి.మీ ప్రయాణం చేసి ఓటు వేయాల్సి వచ్చేది. ఆ గ్రామంలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి తగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనమేదీ లేకపోవడమే ఇందుక్కారణం. దీంతో ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. షిప్పింగ్ కంటైనర్లో ఒక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, ఆ కంటైనర్‌ను పోలింగ్ జరిగే రోజు ఆ గ్రామానికి తీసుకెళ్లి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. వాగ్రా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అలియాబెట్ గ్రామ ఓటర్ల కోసం ఈసీ ఈ ప్రత్యేక ఏర్పాటు చేసింది.

ఒక్క ఓటరు కోసం పోలింగ్ స్టేషన్

ఉనా నియోజకవర్గం పరిధిలోని బనేజ్ గ్రామంలో నివసిస్తున్న ఒక్క ఓటరు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. అలాగే రాజులా నియోజకవర్గం పరిధిలోని షియాబెట్ ద్వీపంలో అమ్రేలీ గ్రామంలో కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఇక్కడికి చేరుకోడానికి ఎన్నికల సిబ్బంది సముద్రంలో బోటు ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది.

తూర్పు ఆఫ్రికా వలస ప్రజల కోసం

తలాల నియోజకవర్గంలోని గిర్-సోమ్‌నాథ్ అటవీ ప్రాంతంలో మధుపూర్ – జంబూర్ పోలింగ్ స్టేషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నివసించే ప్రజలను సిద్ధీలు అంటారు. వీరంతా తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. మొత్తం 3,481 మంది సిద్ధి ఓటర్లున్నారు.

వీటితో పాటు రాష్ట్రంలోని మిగతా అన్ని పోలింగ్ స్టేషన్లనూ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వయోజనులు, దివ్యాంగులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అంధుల కోసం బ్రెయిలీ బ్యాలెట్ స్లిప్పులను అందజేసినట్టు తెలిపింది. ఓటర్లు, పౌరుల ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ఈ-విజిల్ మొబైల్ యాప్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలని ఈసీ సూచించింది. అలాగే సువిధ పోర్టల్ ద్వారా ఆన్లైన్ నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ర్యాలీలు, సభలు, సమావేశాల కోసం అనుమతులు తీసుకునేందుకు సైతం ఈ పోర్టల్ ను వినియోగించుకోవచ్చని తెలిపింది.

కేవైసీ.. (నో యువర్ క్యాండిడేట్) పేరుతో తీసుకొచ్చిన మొబైల్ యాప్ ద్వారా ఓటర్లు తమ అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చని ఈసీ వివరించింది. సగటున ప్రతి 948 మందికి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 51,782 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇందులో సగం (25,891) పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ సదుపాయాన్ని కల్పించినట్టు ఈసీ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement