Wednesday, May 1, 2024

MLC Kavitha – మీ కూట‌మి ప‌క్షం హిందువుల‌ను అవ‌మానిస్తుంటే నోరు మెద‌ప‌రేం … ఎన్నిక‌ల గాంధీని నిల‌దీసిన క‌విత

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర అని.. ప్రజలను మభ్యపెట్టడంలో ఆ పార్టీ ముందు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని విమర్శించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని డీఎంకే నేత హేళన చేసినపుడు ఎన్నిక‌లప్పుడ మాత్ర‌మే క‌నిపించే ఎన్నిక‌ల గాంధీ అదే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

ఒక జాతీయ మీడియాకు ఆమె ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ, కొన్ని వర్గాల ఓట్ల కోసం దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ నాయకులు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంత మంది నేతలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఒక రాష్ట్రంలో ఓట్ల కోసం దేశాన్ని అవమానించడం సరికాదని సూచించారు. . దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ గాంధీ చెబుకుంటున్నారని, కానీ అందుకు వ్యతిరేకంగా వారి మిత్రపక్షం చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం పట్టనట్టు ఉంటున్నారని విమర్శించారు. భారత్ జోడో యాత్ర అన్నది కేవలం ప్రచారం కోసమే అన్నది తేలిపోయిందని స్పష్టం చేశారు.

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా సనాతన ధర్మాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీరియస్‌గా తీసుకొని రాహుల్ గాంధీ స్పందించి ఉంటే పదేపదే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని అభిప్రాయపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే పనిచేసే రాహుల్ గాంధీని అందరూ ఎన్నికల గాంధీ అని పిలుస్తారని విమర్శించారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని, ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారిగా ఉండాలని డిమాండ్ చేశారు. దేశానికి రాహుల్ గాంధీ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల పట్ల గౌరవం ఉందని, హిందీ మాట్లాడే రాష్ట్రాలను అవమానించరాదని, హిందూ వ్యతిరేకి కాదని రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులంటే ప్రగతిలో భాగస్వాములని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అన్నారని, ఆ కార్మికుల పట్ల తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి గౌరవమర్యాదలేవీ లేవని క‌విత ధ్వజమెత్తారు.

కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని రాహుల్ గాంధీ వెల్లడించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవేవో హామీలు ఇస్తుందని, కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కవిత స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తామని ఆమె చెప్పారు. ఆలోగా అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాడుతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement