Thursday, May 2, 2024

కీల‌క మ‌లుపు – కావాలి గెలుపు…

హైదరాబాద్‌, : పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కావాలి గెలుపు.. ఈ ఎన్నికలే కీలక మలుపు అని భావిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ వంటి పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మ కంగా తీసుకోగా, రెండు స్థానాల్లోనూ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం స్థానం ఆదినుండీ టీఆర్‌ఎస్‌కు కంచు కోటగా ఉండగా, ఇక్కడి నుండి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు డాక్టర్‌ పల్లా రాజేశ్వరరెడ్డిని మరోసారి సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారు. మంగళవారం పల్లా రాజేశ్వరరెడ్డి నల్లగొండలో భారీ ర్యాలీతో నామినేషన్‌ వేయనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ఎంపిక చేసి విపక్షాలకు షాకిచ్చారు. రెండు స్థానాలను సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు.. అభ్యర్థుల ఎంపిక ద్వారా సీఎం సంకేతాలిచ్చారు. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలలో పార్టీ ఆశించిన స్థానాలు రాకపోవడంతో.. ఈ మండలి ఎన్నికలు గెలవాల్సిన అనివార్యతను ఏర్పరిచాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ.. సీఎం కేసీఆర్‌ ఎన్నిక విషయం లో అత్యంత సీరియస్‌గా ఉండాలని ఇప్పటికే ఆదేశించారు. సోమవా రం పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లతో కలిసి వాణీదేవి తన నామినేషన్‌ దాఖలు చేశారు. రెండు పట్టభద్ర నియోజక వర్గాల్లో పదిలక్షల మంది ఓటర్లు ఓటు హక్కు విని యోగించుకున్నారు. పట్టభద్రులు, విద్యావంతులు ప్రభుత్వం పట్ల కొంత సానుకూల ధోరణితో లేరని విపక్షాలు ప్రచారం చేస్తున్న నేప థ్యంలో ఈ రెండు స్థానాల్లో గెలుపు ద్వారా టీఆర్‌ఎస్‌ బలం అన్ని వర్గాల్లోనూ చెక్కుచెదరలేదని చాటేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.

కమలం.. గెలవాల్సిన సమయం
బీజేపీ దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితా లు సాధించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించగా, ఈ పట్టభద్ర ఎన్నికల్లో ఆ ఊపును కొనసాగించకుంటే గత ఫలితాల ఎఫెక్ట్‌ నీరుగారి పోనుంది. జరగబోయే ఎన్నికలు, వలసలపై ఇది ప్రభావం చూపనుం ది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు బీజేపీ నగర అధ్యక్షుడు కాగా, సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సి రావడం పార్టీముందున్న పెద్ద పరీక్ష. ఇక్క డి నుండి టీఆర్‌ఎస్‌ అదే సామాజిక వర్గానికి మాజీ ప్రధాని పీవీ కుమా ర్తె వాణీదేవిని ఎంపిక చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుండి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్ధిగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నలుగురి మధ్య హోరాహోరీ ఉండే అవకాశముంది. ఇక.. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం స్థానంలో గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆ స్థానం నిలుపుకోవడంతో పాటు గెలవకుంటే త్వరలో జరగనున్న కార్పోరేషన్‌ ఎన్నికలపై దాని ప్రభావం పడనుంది. ఈ అంశాలన్నీ బేరీజు వేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం కమలం.. గెలవాల్సిన సమయమని భావిస్తోంది.

స్వతంత్రులకు పరీక్ష
ఈ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ జేఏసీని నడిపిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తొలిసారి బరిలో నిలిచారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం స్థానంలో ఆయన పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ బరిలో ఉన్నారు. ఇక ఇతర పార్టీల నుండి, స్వతంత్రులుగా రాణిరుద్రమ, తీన్మార్‌ మల్లన్న, చెరుకు సుధాకర్‌ వంటి నేతలు పోటీ చేస్తుండగా, హైదరాబాద్‌ స్థానం నుండి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ కూడా బరిలో నిలుస్తున్నారు. మొత్తంగా ఆయా పార్టీల బలాబలాలకు, ఉనికికి ఈ ఎన్నికలు పెద్దసవాల్‌గా పరిణమించాయి.

కాంగ్రెస్‌కు జీవన్మరణం

కాంగ్రెస్‌ పార్టీకి ఇది జీవన్మరణ సమస్య. దుబ్బాకలో మూడో స్థానానికి పడిపోయి, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలలో గల్లంతైన కాంగ్రెస్‌ పార్టీ కొత్త సవాళ్ళను ఎదుర్కొంటోంది. గతంలో గెలవని నియోజక వర్గాల్లో.. ఇపుడు బలమైన పరీక్షకు సిద్ధమైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం నుండి మాజీ మంత్రి చిన్నారెడ్డిని బరిలో నిలపగా, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం స్థానం నుండి రాములునాయక్‌ను వ్యూహాత్మకంగా బరిలో నింపారు. ఈ రెండు స్థానాల్లో కనీసం ఒక్కటైనా దక్కించుకుంటే.. కాంగ్రెస్‌ పరువు నిలుస్తుంది. ఇప్పటికే వరుస దెబ్బలతో కుదేలైన కాంగ్రెస్‌.. ఫలితం తేడావస్తే మరింత దెబ్బతింటుంది. ఇప్పటికే వరుసగా పార్టీ నేతలు.. ఇతర పార్టీల్లోకి క్యూ కడుతుండగా, ఈ ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్యత పార్టీపై ఉంది.

- Advertisement -

షర్మిల పార్టీ ఎఫెక్ట్‌

తెలంగాణలో రాజన్నరాజ్యం తెస్తానని ప్రకటించిన షర్మిల పార్టీ ఏర్పాటుకు నిర్ణయించగా, ఈ ఎన్నికలలో దెబ్బతిన్న పార్టీ నుండి వలసలను ఆకర్షించే అవకాశాలున్నాయి. ఇప్పటికే అంశాలవారీగా గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్న షర్మిల వైఎస్సార్‌ అభిమానులతో పాటు వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో ఏదైనా పార్టీకి భవిష్యత్‌ ఇబ్బందికరంగా మారుతుందని నేతలు భావిస్తే.. భారీగా జంప్‌ చేస్తారని ఆశలున్నాయి. కొత్త పార్టీల మనుగడపై కూడా ఈ పట్టభద్ర ఎన్నికల ప్రభావం పడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement