Friday, April 26, 2024

క్యాన్స‌ర్ బాధితునికి అండ‌గా మంత్రి శ్రీనివాస్ గౌడ్

భర్త చనిపోయిన నిర్మల అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆమె పిల్లలు, క్యాన్సర్ తో తీవ్రంగా బాధపడుతున్న పార్టీ కార్యకర్త శ్రీనివాసులు ఆయన భార్య పున్నమ్మ కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో వారి ఆవేదనను విన్న మంత్రి వారితో కలిసి భోజనం చేశారు. స్వయంగా మంత్రి కార్యకర్తలకు భోజనం వడ్డించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.సొంత ఊరిలో ఉపాధి లేక బ్రతుకుతెరువు కోసం పుణె వలస వెళ్లిన హన్వాడ మండలం గొల్లబండ తండాకు చెందిన గోపాల్ అక్కడే అనారోగ్యంతో మృతిచెందారు. భర్త మృతితో ఇద్దరు పిల్లల చదువు, పోషణ కష్టంగా మారడంతో తీవ్ర విచారంలో ఉన్న నిర్మల సోమవారం జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైంది.

సమావేశంలో తన ఆవేదనను మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లింది. బోయపల్లికి చెందిన శ్రీనివాసులుకు క్యాన్సర్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ కష్టంగా జీవితాన్ని నెట్టుకువస్తున్నారు. భార్య పున్నమ్మ కూలీపని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. హాస్పిటల్ ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారింది. పార్టీ సమావేశానికి హాజరైన పున్నమ్మ, శ్రీనివాసులు తమ బాధలను మంత్రి దృష్టికి తీసుకుపోయారు. కార్యకర్తల ఆవేదనను విన్న మంత్రి చలించిపోయారు. నిర్మల పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించాలని, ఆమెకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని వెంటనే తన సిబ్బందికి ఆదేశించారు. క్యాన్సర్ బారిన పడిన శ్రీనివాసులుకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన భార్య పున్నమ్మకు కూడా ఏదైనా ఉద్యోగం చూడాలన్నారు. రెండు కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అందిస్తామని తెలిపారు. ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి.. అపరాత్రి అయినా తానున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement