Thursday, May 2, 2024

పేకాట ఆడుతున్న కేసులో మంత్రి మల్లారెడ్డి సోదరుడు అరెస్ట్

పేకాట శిబిరాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పేకాట ఆడే వారిపై కొన్నాళ్లుగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఓ రహస్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న 11 మంది పేకాటరాయుళ్లను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పేకాట శిబిరంపై దాడులు చేసి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అరెస్టైన వారిలో మంత్రి మల్లారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. పేకాట ఆడుతుండగా ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసు తదుపరి దర్యాప్తు కోసం నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

కాగా ఏప్రిల్‌లో మంత్రి మల్లారెడ్డికి ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గం పరిధిలో వెంచర్ వేసిన రియల్టర్‌ను ఫోన్ కాల్ ద్వారా మంత్రి మల్లారెడ్డి బెదిరించినట్టు ఓ ఆడియో తెగ వైరల్ అవుతోంది. స్థానిక సర్పంచ్‌తో మాట్లాడి తాను వెంచర్ వేసినట్టు సదరు రియల్టర్ చెప్పగా… సర్పంచ్‌తో మాట్లాడితే సరిపోదని.. తన సంగతేంటని మంత్రి మల్లారెడ్డి అన్నట్టు ఆ ఆడియోలో ఉంది. తనను కలిసేంతవరకు ఆ వెంచర్ పనులు ఆపేయాలని ఆయన అన్నట్టు అందులో ఉంది. ఆ ఆరోపణలపై స్పందించిన మల్లారెడ్డి.. ఆడియో టేపులో వాస్తవం లేదని ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement