Monday, April 29, 2024

సీఎంఆర్‌ బియ్యం అప్పగింతలో మిల్లర్ల మాయాజాలం.. గడువు ముగిసినా ఎఫ్‌సీఐకి చేరలే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎఫ్‌సీఐకి అందించాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) విషయంలో మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా రైసు మిల్లుల్లో సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సిన కోటాకు, అందుబాటులో ఉన్న బియ్యం నిల్వలకు చాలా తేడా ఉన్నట్లు ఎఫ్‌సీఐ తనిఖీల్లో తేలింది. ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ కింద పంపాల్సిన బియ్యానికి సంబంధించిన వానాకాలం ధాన్యం నిల్వలు చాలా మిల్లుల్లో లేనట్లు ఎఫ్‌సీఐ తనిఖీల్లో బయటపడింది. దీంతో మిల్లుల వారీగా సీఎంఆర్‌ కోసం ఆ మిల్లు ఎంత ధాన్యం తీసుకుంది..?, ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం ద్వారా ఎంత బియ్యం వచ్చాయి.? అందులో ఎఫ్‌సీఐకి ఎంత పంపించాయి? ఇంకా ఎంత బియ్యం పంపించాల్సి ఉంది.?, వాటికి సంబంధించి మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు సరిపోతున్నాయా..? లేదా? … ఈ విషయాలపై ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీల్లో ప్రధానంగా దృష్టి సారించారు. కొన్ని రైసు మిల్లులు వానాకాలం ధాన్యాన్ని అధిక ధరకు అమ్ముకున్నట్లుగా తేలింది. తాజాగా యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్నే ఖరీఫ్‌(వానాకాలం) ధాన్యంగా లెక్కలు చూపిస్తున్నారని ఎఫ్‌సీఐ అధికారులు చెబుతున్నారు.
ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఈ ఏడాది ఖరీఫ్‌ సీఎంఆర్‌ బియ్యాన్ని ఈ ఏడాది మే 31 లోగా ఇవ్వాల్సి ఉంది. మిల్లర్లు ఎంతకి బియ్యాన్ని అప్పగించకపోవడంతో ఈ నెల 30 వరకు సీఎంఆర్‌ బియ్యం అప్పగింత గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. గడువు ముగుస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్రంలోని 70శాతం మిల్లులు ఎఫ్‌సీఐకి ధాన్యం ఇవ్వలేదని తేలింది. 2021-22 వానాకాలం సీజన్‌కు సంబందించిన సీఎంఆర్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో మిల్లర్లు చూపిస్తున్న ధాన్యం ఖరీఫ్‌ సీజన్‌దా.. ? లేక రబీ సీజన్‌దా..? తేల్చే పనిలో ఎఫ్‌సీఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకు సాంకేతిక బృందం సాయం తీసుకోనున్నారు.

మరోవైపు చాలా రైసు మిల్లులు నేరుగా రైతుల దగ్గరనుంచే ఈ ఏడాది పెద్ద ఎత్తున కనీస మధ్దతు ధరకన్నా రూ.400 తక్కువగా పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. ఇది చాలదన్నట్లు తాలు, ఇసుక తదితర కారణాలతో క్వింటాల్‌కు పది కిలోల వరకు కోత పెడుతున్నాయి. ఈ ధాన్యాన్ని అంతా మిల్లింగ్‌ చేసి బయట అమ్ముకుంటున్నట్లు రైసు మిల్లులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది సీఎంఆర్‌ బియ్యం అప్పగించే గడువు దాటినా కూడా మిల్లులు ఎఫ్‌సీఐకి బియ్యాన్ని అప్పగించలేదు. రేషన్‌ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్‌ చేస్తూ పెద్ద ఎత్తున మిల్లులు అక్రమాలకు పాల్పడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement