Sunday, April 28, 2024

MI vs DC | ఎట్టకేలకి ముంబయి బోణి..

ఐపీఎల్ 2023లో ముంబయి ఇండియన్స్ ఎట్టకేలకి బోణి కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పేలవంగా ఓడిపోయిన ముంబయి టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాదించింది. మరోవైపు నాలుగో మ్యాచ్‌ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.. వరుసగా నాలుగో ఓటమితో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది.

మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 172 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ 65: 45 బంతుల్లో 6×4, 4×6లతో దూకుడుగా ఆడేశాడు. అతనికి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 31: 26 బంతుల్లో 6×4 పవర్ ప్లేలో మంచి సహకారం అందించినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఇషాన్ రనౌటయ్యాడు. అయితే నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ 41: 29 బంతుల్లో 1×4, 2×6 స్లాగ్ ఓవర్‌లో వరుస సిక్సర్లు బాదేశాడు. దాంతో అలవోకగా గెలిచేలా కనిపించిన ముంబయి టీమ్.. తిలక్ వర్మ 139 పరుగుల వద్ద ఔటవగానే ఒత్తిడికి గురైంది. నెం.4లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (0) గోల్డెన్ డక్‌గా ఔటైపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆ వెంటనే వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. బంతులు, పరుగుల మధ్య అంతరం పెరిగిపోతూ వచ్చింది.

ముంబయి విజయానికి చివరి 12 బంతుల్లో 20 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో క్రీజులో నిలిచిన టిమ్ డేవిడ్ 13: 11 బంతుల్లో 1×6, కామెరూన్ గ్రీన్ 17 నాటౌట్: 8 బంతుల్లో 1×4, 1×6.. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో చెరో సిక్స్ కొట్టి మొత్తం ఆ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టారు. దాంతో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 5 పరుగులుగా మారిపోయింది. ఇక చివరి ఓవర్ వేసిన నోకియా బౌలింగ్‌లో ఈ జంట 1,0,0,1,1,2 పరుగులు చేసి ముంబయిని గెలిపించింది. లాస్ట్‌ బాల్‌కి రెండు పరుగులు అవసరం అవగా.. మిడాఫ్ దిశగా బంతిని కొట్టిన టిమ్ డేవిడ్.. అత్యంత కష్టంగా రెండో పరుగుని డైవ్ చేస్తూ పూర్తి చేశాడు. ఢిల్లీ కీపర్ అభిషేక్ రనౌట్ కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement