Wednesday, May 15, 2024

Delhi | పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు.. వినాయక చవితి నాడే ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ నెల 19న వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని కొత్త భవనంలో సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే అధికారికంగా అటు ప్రభుత్వం నుంచి, పార్లమెంట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను తొలి రోజు పాత భవనంలోనే నిర్వహించి, రెండో రోజు నుంచి కొత్త భవనంలో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. ఇవి ప్రత్యేక సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్ బిజినెస్ వంటివేవీ ఉండవని, కేవలం ప్రభుత్వ బిజినెస్ మాత్రమే ఉంటుందని అధికారులు వెల్లడించారు. అంటే కేవలం బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చ, ఓటింగ్, పాస్ చేయడం వంటి కార్యాకలాపాల కోసమే ఈ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టింది.

- Advertisement -

ఎవరినీ సంప్రదించలేదు.. అజెండా ఏంటో చెప్పలేదు : ప్రధానికి రాసిన లేఖలో సోనియాగాంధీ

ఏ రాజకీయ పార్టీని సంప్రదించుకుండానే పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసిన ఆమె ఎవరినీ సంప్రదించకుండా సమావేశాలు ఏర్పాటుచేయడాన్ని తప్పుబట్టారు. కేవలం ప్రభుత్వ బిజినెస్ మాత్రమే ఉంటుందని తమకు సమాచారం ఇచ్చారని ఆమె అన్నారు.

అయినప్పటికీ ఈ స్పెషల్ సెషన్‌లో పాల్గొంటామని సోనియా తెలిపారు. ఒకరకంగా దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకు, సభలో లేవనెత్తేందుకు ఇదొక అవకాశంగా భావిస్తామని ఆమె అన్నారు. తాము లేవనెత్తబోయే ప్రజా సమస్యలపై చర్చించడానికి తగిన సమయం కేటాయించాలని ప్రధాని మోదీని ఆమె కోరారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పై చర్చించాలని అన్నారు.

రైతు సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలపై కూడా చర్చ జరగాలన్నారు. అలాగే అదానీ గ్రూపు వ్యాపారాలు, లావాదేవీలపై ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’తో విచారణ జరిపించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. మణిపూర్ హింస, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని, హర్యానాలో చోటుచేసుకున్న మత హింస నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న మత విద్వేషాలపై కూడా చర్చించాలి ఆమె తన లేఖలో కోరారు.

అరుణాచల్ ప్రదేశ్, లద్దాక్ ప్రాంతాల్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించి, తన ఆధీనంలో పెట్టుకుందని, ఈ అంశంపై కూడా పార్లమెంటులో చర్చించాలని అన్నారు. అత్యవసరంగా కుల గణన చేపట్టాలని సోనియా ప్రధాన మంత్రిని డిమాండ్ చేశారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు దెబ్బతినడం వంటి అంశాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాల గురించి, కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న కరవు పరిస్థితుల గురించి చర్చించాలని సోనియా గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement