Tuesday, April 30, 2024

భారీగా తహసీల్దార్లకు పదోన్నతులు.. రెవెన్యూలో మరో 7వేల పోస్టుల క్రియేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 18మంది తహశీల్దార్లను డిప్యుటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించిన తెలంగాణ సర్కార్‌ తాజాగా భారీ సంఖ్యలో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తహశీల్దార్లకు పదోన్నతులు దక్కడంతో రెవెన్యూ శాఖలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో తహశీల్దార్లకు పదోన్నతులు దక్కడం ఇదే తొలిసారి. గురువారం ఈ మేరకు ఒకేసారి 81 మంది తహశీల్దార్లకు డిప్యుటీ కలెక్టర్లుగా ప్రమోషన్లనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా త్వరలో పదోన్నతులతో బదలీ కానున్నారు.

రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా పదోన్నతులకు చర్యలు తీసుకుంటోంది. ఖాళీగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తూ పాలనలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలో నిస్తేజాన్ని తొలగించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న డిప్యుటీ కలెక్టర్లను స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్లుగా పదోన్నతులు వర్తింపజేసింది. ఒకేసారి 56 మంది పేర్లను పరిశీలించగా, 30మందివరకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్లుగా పదోన్నతులకు అవకాశం కల్పించింది.

- Advertisement -

రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత 23 కొత్త జిల్లాలు, భారీగా మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో కొత్త కొలువులు అనివార్యమయ్యాయి. వివిధ శాఖలకు సిబ్బంది కొరత ఎదురైన నేపథ్యంలో అవసరాలను తీర్చేందుకు కొత్త కొలువులతోపాటు పదోన్నతుల ద్వారా భర్తీలు చేయడం కూడా కలిసిరానుందని గుర్తించింది. ఇందులో భాగంగా తొలి దశలో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి గతంలో ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బుధవారం మరోసారి రెవెన్యూ శాఖలో 7142 అదనపు పోస్టులను ప్రత్యేకంగా సృష్టించింది. 74 రెవెన్యూ డివిన్లు, 611 తహశీల్దార్‌ కార్యాలయాలలో వీటిని భర్తీ చేయనుంది.

కొత్త జిల్లాల ఆవిర్భావానికి ముందే నూతన ఉద్యోగాలపై ప్రభుత్వం కొంత కసరత్తు చేసింది. కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చిన తర్వాత అనేక శాఖలను విలీనం చేసినప్పటికీ, సిబ్బంది సర్ధుబాటు పూర్తయినా ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉండటంతో కొత్త కొలువులపై కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యను అధిగమించేందుకు పెరిగిన అవసరాలకు అనుగుణంగా 7142 పోస్టులను భర్తీ చేయాలని ఆర్ధిక శాఖకు నివేదిక అందింది. తాజాగా పలువురు సీనియర్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్లకు డీఆర్వోలుగా బాధ్యతలను అప్పగించారు. మరికొందరిని డీఆర్వోలుగా నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement