Wednesday, May 1, 2024

రెవెన్యూలో భారీగా పదోన్నతులు.. ఒకేసారి 169మంది డీటీలకు తహశీల్దార్లుగా ప్రమోషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెవెన్యూ శాఖలో పదోన్నతులకు పచ్చజెండా ఊపుతోంది. వరుసగా పదోన్నతులు, బదలీలతో ఈ శాఖలో సంస్కరణలు వేగంగా జరగుతున్నాయి. సుదీర్గకాలంగా పెండింగ్‌లో ఉన్న నాయబ్‌ తహశీల్దార్లకు పదోన్నతులు కల్పించారు. మంగళవారం సీసీఎల్‌ఏ అధ్యక్షతన సమావేశమైన పదోన్నతుల కమిటీ 169 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించింది. 2016-17 పానల్‌ ఇయర్‌కు సంబందించిన నాయబ్‌ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు రావడం పట్ల రెవెన్యూ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

ఈ సందర్బంగా టెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌ కుమార్‌, టెసా రాష్ట్ర బృందం సీసీఎల్‌ఏ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత నెలలో 100 మంది డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో రెవెన్యూ శాఖలో క్రింద నుండి పైకి అన్ని స్థాయిల్లో పదోన్నతుల ఛానల్‌ కదిలిందని, మంగళవారంనాడు 169 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించారని తెలిపారు.

తర్వాత 200 పైగా సీనియర్‌ అసిస్టెంట్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా అదే స్థాయిలో జూనియర్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్లకు పదోన్నతులు కల్పించనున్నారని టెసా వెెల్లడించింది. రెవెన్యూలో ప్రమోషన్లకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌, సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌లకు టెసా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెసా అధ్యక్షులు వంగ రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌ కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షులు మన్నె ప్రభాకర్‌, ఉపాధ్యక్షులు కె. నిరంజన్‌, రమేష్‌ పాక, కార్యదర్శి చిల్లా శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శులు నజీమ్‌ ఖాన్‌, శ్రావణ్‌ కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు కె. రామకృష్ణ, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు రమన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement