Sunday, April 28, 2024

మావోయిస్ట్ డీసీఎం నేరెళ్ల‌ జ్యోతి లొంగుబాటు : సీపీ సుబ్బారాయుడు

మావోయిస్ట్ పార్టీ డీసీఎం నేరెళ్ల‌ జ్యోతి(అలియాస్ జ్యోతక్క) లొంగిపోయినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగులవల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల‌ జ్యోతి (అలియాస్ జ్యోతక్క) 2004 సంత్సరంలో సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం చదువుచున్న రోజులలో విప్లవ గీతాలకు ఆకర్షితురాలైందన్నారు. తరువాత తన అక్కదగ్గరికి వెళ్ళిన సందర్భంలో గ్రామంలో మావోయిస్టు తీవ్రవాదులు నిర్వహించిన మీటింగ్ లో పాల్గొని అప్పటి దళ కమాండర్ రఘు ద్వారా దళంలోకి వెళ్ళినదన్నారు. కొద్దిరోజులు సిరిసిల్ల ఏరియాలో పనిచేసి, మానాల ఎన్ కౌంటర్ జరిగిన తరువాత, ఆదిలాబాద్ జిల్లా మంగి దళంలో పని చేసిందన్నారు. 2011 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని కర్రిగుట్ట ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ తరువాత జంపన్నతో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్ళి, ప్రెస్ కమిటీ మెంబర్ గా పని చేసిందన్నారు. పార్టీలో పనిచేస్తూ, ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుని అతని వేధింపులు భరించలేక 2012 సంవత్సరంలో అతని నుండి విడిపోయినదని, సుమారు 20 సంవత్సరాలు వివిధ హోదాలలో మావోయిస్టు తీవ్రవాద సంస్థలో మూడు రాష్ట్రాలలో పని చేసిందన్నారు.

మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలు, అనాగరిక ఆలోచనలతో ఆదివాసీ ప్రజల పట్ల, పార్టీలోని మహిళా సభ్యుల పట్ల అసమానతతో మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న తీరుపట్ల అసహనం చెంది తెలంగాణ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి పనులు, లొంగిపోయిన తీవ్రవాదులను అన్ని విధాలా ఆదుకుంటూ అండగా నిలుస్తున్న విధానం నచ్చి మరియు పోలీసువారు “ఆపరేషన్ చేయూతష‌ కార్యక్రమం ద్వారా లొంగిపోయిన తీవ్రవాదులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న సహకారం వల్ల, జన జీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితాన్ని గడపడానికి నిర్ణయించుకుని లొంగిపోయారన్నారు.మావోయిస్టు తీవ్రవాదులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా, కమిటీలను ఏర్పాటు చేసి, బలవంతపు వసూళ్ళు, ఆదివాసీలను ప్రలోభపెట్టి, భయపెట్టి, మైనర్లను కూడా తీవ్రవాదులుగా తయారు చేస్తున్నదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని అమాయకపు ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాలనుండి బలవంతంగా అమాయక యువకులను, మైనర్లను భయపెట్టి, పార్టీలోకి చేర్చుకుంటున్నారన్నారు. వారందరు కూడా పార్టీ భావజాలం, సిద్దాంతాల గురించి తెలియని, చదువురాని అమాయక ప్రజలు. మావోయిస్టులుగా మారితే మరో ప్రపంచంలోకి వెళతామని, సమాంతర ప్రభుత్వాలను నడుపుతామని, మాయమాటలతో వారిని ప్రలోభపెట్టి, భయభ్రాంతులకు గురిచేసి తీవ్రవాదులుగా మారుస్తున్నారు. తీవ్రవాదులుగా మారిన యువతీ, యువకులు మరియు మైనర్లు అక్కడి వేధింపులు, వ్యతిరేక పరిస్థితులను భరించలేక కొద్దిరోజులకే పార్టీనుండి బయటకు వస్తే, వారిని, వారి కుటుంబ సభ్యులను భయపెట్టి తిరిగి తీసుకువెళ్ళుచున్నారన్నారు. చైనా, రష్యా లాంటి దేశాలు మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను వదిలి ప్రజాస్వామ్య విధానాలతో, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణలతో అభివృద్ధివైపు దూసుకువెళుతుంటే, మావోయిస్టుల‌ను తీవ్రవాదులు మాత్రం తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందనే బూజుపట్టిన సిద్ధాంతాలతో అమాయక ప్రజలను ప్రలోభ పెట్టి, ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.

మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న దళ నాయకులు, దళ సభ్యులు గత కొంత కాలంగా పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చక సాధారణ జీవితం గడపడానికి లొంగిపోతున్నారు. అదే విధంగా, ముఖ్యమైన నాయకులు, దళ సభ్యులు వరుసగా అరెస్టు కావడం, లొంగుబాట్లు, అరెస్టులతో పార్టీ దిక్కుతోచని స్థితిలో అంతర్మథనంలో పడినది. అనేకమంది దళ నాయకులు, సభ్యులు, ముఖ్యంగా దళంలో పనిచేస్తున్న యువ నాయకులు, దళ సభ్యులు అడవులను వీడి, జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకుంటున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఆదివాసీ యువకుల ప్ర్రాణాలతో చెలగాటమాడకుండా, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని మనవి చేస్తున్నాము. లొంగిపోయి సాధారణ జీవితం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గాని, స్వయంగా గాని తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో లేదా, జిల్లా ఉన్నతాధికారుల వద్దగాని సంప్రదించినట్లయితే వారికి జీవనోపాధి, పునరావాసం కల్పించి, ప్రభుత్వం తరపున అన్నిరకాల ప్రతిఫలాలను అందజేస్తామని హామీ ఇస్తున్నాము, లొంగిపోయిన నేరెల్ల జ్యోతిపైన ఉన్న 5 లక్షల రూపాయల రివార్డు నగదు మరియు ప్రభుత్వం తరపున పునరావాసం, జీవనోపాధి మరియు ఇతర ప్రతిఫలాలు అందజేయబడతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement