Thursday, April 25, 2024

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో రక్షణ వస్తువుల తయారీ.. మూడో రక్షణ పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన లేదన్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో 2021 నుంచి రక్షణ వస్తువుల తయారీని ప్రోత్సహిస్తున్నట్టు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ వస్తువుల తయారీకి సంబంధించి ప్రైవేట్ కంపెనీలు/ఎంఎస్ఎంఈలకు కేంద్రం లైసెన్స్‌లు జారీ చేసిందా? ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సహకాలేంటి? బుందేల్ ఖండ్‌లో 3వ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించిందా? అని ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఆయన ప్రశ్నలకు బదులిచ్చారు. రక్షణ రంగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 369 కంపెనీలకు 606 ఇండస్ట్రియల్ లైసెన్స్‌లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

దేశంలో రక్షణ పరిశ్రమకు సంబంధించి స్వదేశీ డిజైన్, అభివృద్ధి, రక్షణ పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో 74 శాతం ఎఫ్‌డీ‌ఐని అనుమతించేలా నరళీకరణ చేశామని కేంద్రమంత్రి వివరించారు. ఇందుకు సంబంధించి ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ పథకాన్ని ప్రారంబించామని ఆయన జవాబులో పేర్కొన్నారు. రక్షణ వస్తువుల తయారీ విషయంలో పెట్టుబడులను ఆకర్షించడం జరుగుతుందని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఒకొక్కటి చొప్పున రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేశామని, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 3వ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని అజయ్ భట్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement