Sunday, April 28, 2024

Manifesto – కేసీఆర్ భరోసా బీఆర్ఎస్ పార్టీ కి బ్రహ్మాస్త్రం

సూర్యాపేట – భీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన భరోసా అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గడపగడపకు మ్యానిఫెస్టో పేరుతో సూర్యాపేటలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి, పట్టణంలోని కుడ..కుడ రెండవ వార్డ్ ఎస్సీ కాలనీలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా సవారి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రతీని అమ్మవారికి అందజేశారు. అనంతరం కాలనీ తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అందజేసి చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు సవివరంగా వివరించారు. సరిగ్గా ఉదయం 11 :16 నిమిషాలకు కాలనీకి వెళ్లిన మంత్రికి నివాళులు మంగళహారతులతో మహిళా మణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మ్యానిఫెస్టో తో కేసీఆర్ ఇచ్చిన భరోసా బీఆర్ఎస్ పార్టీ కి బ్రహ్మాస్త్రం అన్నారు.కెసిఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.

రాష్ట్రం లో పదేళ్ల కాలంలోనే వందేళ్ళ అభివృద్ధిని చేసి చూపించిన నేత కేసిఆర్ అన్నారు.దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి ,రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.రైతులకు 35 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.రైతులకే అన్నం దొరకని పరిస్థితుల నుండి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను మార్చిన రైతు బాంధవుడు కేసీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నేరవేర్చడంతో పాటు అదనంగా మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన వారందరికీ అందజేశామన్నారు.కొత్తగా ప్రవేశ పెట్టిన పథకాలలతో తెలంగాణ అభివృద్ధి నెక్ట్స్ లెవెల్ కు చేర బోతుందని అన్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే పది రోజుల్లోనే ఐదు లక్షలు వచ్చేలా ప్రవేశపెట్టబోయే కేసీఆర్‌ బీమా ప్రతి ఇంటికి ధీమా అన్నారు. కెసిఆర్ బీమా తో రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు .

అందరికీ సన్నబియ్యం పంపిణీ చేసే అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్‌ 5,016, దివ్యాంగులకు 6 వేల పెన్షన్‌ పెంపు, రైతుబంధు 16 వేలు, ఆగ్రవర్ణ పేదలకు గురుకులాలు, కేసీఆర్‌ ఆరోగ్యరక్షకు రూ. 15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి రూ. 3 వేలు మహిళలకు జీవనభృతి, గ్యాస్‌ సిలిండర్‌ రూ. 4వందలకే, మహిళ సమాఖ్యలకు సొంత భవనాలు, గృహ లక్ష్మి హామీలను ఇంటింటికీ ప్రచారం చేసి వివరించామన్నారు.. దీనికి సంబంధించి మ్యానిఫెస్టోలను కరపత్రాలను ఇంటింటికీ అందజేశామన్నారు.రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో ఇల్లులేని వారు ఉండకూడదనేదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే.. కెసిఆర్ పై ప్రజలకు ఉన్న భరోసా కు నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement