Saturday, May 18, 2024

సరిహద్దుల్లో కన్నీటి ధారలు.. తాత్కాలిక శిబిరాలతో పోలండ్‌, హంగేరి సహాయం..

రష్యా బాంబులు, క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో బతుకుజీవుడా అంటూ సరిహద్దు దేశాలవైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పిల్లాపాపలను, కొద్దిపాటి సామాన్లను పట్టుకుని సరిహద్దు దేశాలవైపు వెడుతున్నారు. గడచిన మూడు రోజుల్లో దాదాపు 2 లక్షలమంది వలస వెళ్లినట్లు భావిస్తున్నారు. శరణార్థుల కోసం యూరోపియన్‌ దేశాలు సరిహద్దులను తెరిచి ఉంచుతున్నాయి. గతంలొ సిరియానుంచి పెద్దఎత్తున శరణార్థుల వచ్చి సమస్యలు సృష్టించిన నేపథ్యంలో నిజానికి శరణార్థులకు ఆశ్రయం ఇవ్వరాదని గతంలో పోలెండ్‌, హంగేరీ వంటి దేశాలు కఠిన వైఖరిని అవలంబించాయి. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన నేపథ్యంలో వైఖరిని మార్చుకుని ఆశ్రయం ఇవ్వాలని నిర్ణయించాయి. సరిహద్దుల్లో శరవేగంగా తాత్కాలిక శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆహారం, మంచినీరు, ఔషధాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆయాదేశాల పౌరులూ ఉక్రెయిన్‌ శరణార్థులకు అండగా ఉంటున్నారు. స్లోవేకియా కూడా ఉక్రెయిన వలసదార్లకు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించింది. దాదాపు వంద కి.మి. సరిహద్దులో అగ్నిమాపక దళం శిబిరాలను నిర్మిస్తోంది. గడచిన 24 గంటల్లో తమ భూభాగంలోకి 10,526 మంది శరణార్థులు వచ్చారని స్లొవేకియా ప్రకటించింది. వీరంతా 3 నెలల పాటు అక్కడ తలదాచుకునేందుకు అనుమతిచ్చింది.

ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలతో ఉన్న ఒప్పందం వల్ల ఆయా దేశాలకు వెళ్లేందుకు వీసాలు అక్కర్లేదు. అయితే కొన్ని ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి వచ్చే ప్రతి ఒక్కరికి ఆశ్రయం కల్పిస్తామని పోలండ్‌కూడా ప్రకటించింది. గురువారం ఒక్కరోజే దాదాపు 30వేలమంది పోలండ్‌ సరిహద్దులు దాటొచ్చారు. ఇక మోల్దోవా, రొమేనియాలకు ఎక్కువగా శరణార్థులు వస్తున్నారు. ఒక్కరోజులు 26వేలమంది వలస వచ్చారు. ఉక్రెయిన్‌నుంచి వచ్చే శరణార్థులను ఆదుకునేందుకు చెచియా కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకుంది.మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా స్పందిస్తోంది. సరిహద్దు దేశాలతో నిరంతరం సంప్రదింపులు చేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో దేశం విడిచివెడుతున్న బాధితులకు అండగా ఉంటామని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం హై కమిషనర్‌ ఫిలిప్పో గ్రాండీ వెల్లడించారు. మరోవైపు గ్రీస్‌ కూడా సరిహద్దుల్లో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement