Wednesday, May 15, 2024

Delhi: ‘మహంగాయీ పర్ హల్లా బోల్‌’.. రాంలీలా మైదాన్‌లో నినదించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్న అధిక ధరలపై కాంగ్రెస్ గళమెత్తింది. దేశ రాజధానిలో రాంలీలా మైదాన్ వేదికగా భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీని రాజుగా అభివర్ణిస్తూ ఆయన వినేంతవరకు ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం భారత్ చేరుకున్న రాహుల్ గాంధీ, నేరుగా రాంలీలా మైదాన్ చేరుకుని మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నా కోసం ఢిల్లీకి ఆనుకున్న రాష్ట్రాలు హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఢిల్లీ నగర వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో మహేశ్వర్ రెడ్డి ఏర్పాటుచేసినవే ఎక్కువ సంఖ్యలో కనిపించాయి. తొలుత ముఖ్య నేతలందరూ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం చేరుకుని, అక్కణ్ణుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో రాంలీలా మైదాన్‌లో ఏర్పాటు చేసిన ధర్నా వేదికకు చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సాకె శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ నేతలు గిడుగు రుద్రరాజు, సంపత్, శ్రీధర్ బాబు, బోసు రాజు, తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ నేతలు జీవన్ రెడ్డి, మహేశ్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, గీతా రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సీనియర్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సామాన్యుడిపై పెనుభారాన్ని మోపుతున్న అధిక ధరలు, జీఎస్టీ పెంపు, నిరుద్యోగ సమస్యపై ఈ నిరసన ప్రదర్శన చేపట్టామని ఏఐసీసీ కార్యాలయం నుంచి బస్సులో బయల్దేరే ముందు ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. దేశంలో విద్వేషాన్ని పెంచిపోషిస్తూ ప్రజల మధ్య విభజన రేఖను గీస్తున్న భారతీయ జనతా పార్టీకి బుద్ధిచెబుతూ ప్రజల్ని ఏకం చేయడం కోసం రాహుల్ గాంధీ తలపెట్టి ‘భారత్ జోడో’ యాత్రకు ఈ మహాధర్నా ఒక కిక్ స్టార్ట్‌ అని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. యూపీఏ హయాంలో రూ. 450 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 1,150 అయిందని.. ఇదే మాదిరిగా అనేక వస్తువుల ధరలు రెట్టింపు నుంచి నాలుగు రెట్ల వరకు పెరిగాయని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు.

యూపీఏ హాయంలో పేదవాడికి ఆహారభద్రత, ఉపాధి కల్పించడం కోసం పనికి ఆహార పథకం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వంటి చట్టాలను, పాలనలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిందని, కానీ బీజేపీ పాలనలో ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు మినహా ఎవరికీ ఏ రకమైన భద్రత లేదని అన్నారు. కొందరు నేతలు బస్సులో ప్రయాణిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగ నిరసనలు చేపట్టారు. బంగా భవన్ నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హెడ్‌క్వార్టర్స్‌కు ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ అరెస్టులపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ కేవలం రామ్‌ లీలా మైదానంలో నిరసనలు చేపట్టేందుకు అనుమతి తీసుకుందని, మిగతా ప్రాంతాల్లో ఆందోళనలు చేసినందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

దేశం ద్రవ్యోల్బణం, అధిక ధరలతో సతమతమవుతూ ఉంటే రాజు గారు (ప్రధాని మోదీ) కొత్త స్నేహితులను సంపాదించుకునే పనిలో పడ్డారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహాధర్నా వేదికపై కాంగ్రెస్ నేతల ప్రసంగాల అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ధరల పెరుగుదలపై నినదిస్తూనే ఉంటామని, రాజు గారు వినేంత వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మోదీ సర్కారు ఏర్పడ్డ తర్వాత దేశంలో విద్వేషాలు పెరిగిపోయాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని విభజిస్తున్నాయని విరుచుకుపడ్డారు.

- Advertisement -

తమ భవిష్యత్తు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య వంటి అంశాలపై ప్రజలు మాట్లాడేందుకే భయపడుతున్నారని, దేశంలో అభద్రతాభావం అంతగా పెరిగిపోయిందని ఆయనన్నారు. ప్రభుత్వం నుంచి ఇద్దరు వ్యాపారవేత్తలు మాత్రమే లబ్ధిపొందుతున్నారని, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రోడ్లు… ఇలా ప్రతి ఒక్కటీ ఆ ఇద్దరే చేజిక్కించుకుంటున్నారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొడుతూ నరేంద్ర మోదీ దేశాన్ని వెనకబడేలా చేస్తున్నారని, తద్వారా పాకిస్థాన్‌, చైనాలు లబ్ధి పొందుతున్నాయని ఆరోపించారు. పీఎం మోదీ గత 8 ఏళ్లుగా దేశాన్ని బలహీనపరిచారని రాహుల్ గాంధీ విమర్శించారు. మొత్తంగా దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్వేషాలు ప్రధాన సమస్యలుగా మారాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement