Tuesday, May 7, 2024

Delhi: బయ్యారంపై మాట తప్పింది మీరే.. కేసీఆర్, ఆయన కుటుంబమే దోషులు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దమ్ముంటే బయ్యారం స్టీల్ ప్లాంట్ కట్టి చూపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అసలైన దోషులని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పలుమార్లు తేల్చి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆర్నెల్లలోపే జరిగిందని, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నిపుణుల కమిటీ 2014 నవంబర్ లో ఫీజిబిలిటీ నివేదికను అందించిందని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా 2018 మార్చి 7వ తేదీన రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఏర్పాటు చేసిన కమిటీని మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ సమీక్షించారని, ఆ కమిటీ కూడా బయ్యారంలో లభించే ఐరన్ ఓర్ నాణ్యమైనది కాదని చెప్పిందని కిషన్ రెడ్డి అన్నారు.

ఇంత జరిగినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అర్థరహితమైన విమర్శలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకోవడంతోపాటు, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీపై బురద జల్లుతోందని విమర్శించారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ కట్టకపోతే సింగరేణి – టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో తామే నిర్మిస్తామంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్ ప్రగల్బాలు పలికారంటూ అప్పటి వీడియోలను కిషన్ రెడ్డి మీడియాకు చూపించారు.

ఇప్పటికైనా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని కట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే మీరు చేసిన మోసాలను ప్రజలు మరిచిపోతారా అని ముఖ్యమంత్రి కుటుంబసభ్యులను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మీ ఉత్తర కుమార ప్రగల్భాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు మిమ్మల్ని మరింతగా ఛీత్కరించుకునేలా వ్యవహరించకండంటూ కిషన్ రెడ్డి హితవు పలికారు. టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి బయ్యారం ఫ్యాక్టరీపై ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయిందని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. భూ, ఇసుక, మద్యం మాఫియా పెట్రేగిపోతోందని ప్రభుత్వం వీటిని నియంత్రించడం మాని కేంద్రంపై విమర్శలు చేయడం అర్థరహితమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. భూ సమస్యలను పరిష్కరించాలంటూ ధరణి పోర్టల్ ద్వారా దాదాపు 4 లక్షల దరఖాస్తులు వస్తే ఒక్క కేసును కూడా పరిష్కరించలేకపోయారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోడు భూముల విషయంలో రైతులపై లాఠీలు ఝుళిపిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అడ్డంకులు సృష్టిస్తోందని, ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ విషయంలో సహకరించడం లేదన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దీనమైన స్థితిలో ఉంటే వాటన్నింటినీ పక్కనపెట్టి కేసీఆర్ సొంత లాభం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసిన తర్వాత జాతీయ పార్టీ ఆలోచన చేస్తే బాగుంటుందని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement