Saturday, May 4, 2024

Delhi: కాలానికి తగ్గట్టు సాహిత్యం మారాలి.. ఢిల్లీలో శాంతిశ్రీ పుస్తకాల ఆవిష్కరణలో వక్తలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాలానికి తగ్గట్లుగా సమాజంలో వస్తున్న మార్పులకు, నేటితరం అభిప్రాయాలకు అనుగుణంగా రచనలు జరిగినప్పుడే సాహిత్యానికి విలువ పెరుగుతుందని సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవి, రచయిత ఎడిటర్ ఎ.కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ప్రముఖ రచయిత్రి శాంతిశ్రీ బెనర్జీ రచించిన కథల సంపుటి మానుషి, కవితల సంకలనం ఆలంబనను ఆదివారం ఢిల్లీలో ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. సమాజంలో జరుగుతున్న అన్ని దారుణాలను జర్నలిస్టులు చిత్రించలేరని, శాంతిశ్రీ వంటి రచయితలు తమ కథలు, కవితల ద్వారా వాటిని వెలుగులోకి తెస్తారని కృష్ణారావు అన్నారు.

నెహ్రూ హయాంలో అన్యాయానికి గురైన సంతాలీ స్త్రీ బుధిని, లాక్ డౌన్ సమయంలో 500 మైళ్లు తండ్రిని సైకిల్ ఎక్కించుకుని తొక్కిన యువతి అనుభవాలను శాంతిశ్రీ మనసులకు హత్తుకునే కథలుగా మలిచారని ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ గంపా వెంకట్రామయ్య విశ్లేషించారు. శాంతిశ్రీ కథలు, కవితల గురించి ప్రముఖ తెలుగు రచయిత్రి పప్పు శాంతాదేవి, సత్తిరాజు పద్మ విశ్లేషించారు. ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు మణినాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రచయితలు పత్తిపాక మోహన్, జేఎల్ రెడ్డి, దేవరకొండ సుబ్రహ్మణ్యం, కందుకూరి సూర్యనారాయణ, మంచిరాజు లహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement