Monday, April 29, 2024

షేరు విలువ పెంచేందుకు ఎల్‌ఐసీ ప్లాన్‌..

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) స్టాక్‌మార్కెట్‌లో షేరు విలువను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన నాటి నుంచి షేరు విలువ 35 శాతం విలువ కోల్పోయింది. ఎల్‌ఐసీ షేరు 949 రూపాయలతో లిస్ట్‌ అవ్వగా, ప్రస్తుతం 600 లోపుగానే ట్రేడవుతోంది. దీని వల్ల ఎల్‌ఐసీ షేర్లపై ఇన్వెస్టర్లకు విశ్వాసం సన్నగిల్లుతోంది. దీన్ని నిలబెట్టుకునేందుకు, షేరు విలువను పెంచుకోవడం ద్వారా మార్కెట్‌ విలువను పెంచుకోవాలని ఎల్‌ఐసీ నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు చేపట్టింది. పాలసీ హోల్డర్లకు చెందిన 1.81 లక్షల కోట్లను ఫండ్‌లోని బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ నిధులతో డివిడెండ్‌ లేదా బోనస్‌ షేర్‌ ఇచ్చేందుకు నిర్ణయించింది. నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఫండ్‌లో ఉన్న మిగులు మొత్తాన్ని ఇందు కోసం వినియోగించనున్నారని సమాచారం.

ఎల్‌ఐసీ రెండు రకాల పాలసీలను విక్రయిస్తోంది. ఇందులో ఒకటి పార్టిసిపేటింగ్‌ పాలసీలు, ఈ పాలసీలు తీసుకున్న షేర్‌ హోల్డర్లకు లాభాల్లో వాటా అందిస్తారు. రెండోది నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీలు. ఈ పాలసీల్లో ఫిక్స్‌డ్‌ రిటర్న్స్‌ ఉంటాయి. వీటికి ప్రీమియం వసూలు చేసి నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఫండ్‌లో ఎల్‌ఐసీ ఉంచుతోంది. ఇందులో కొంత మొత్తాన్ని షేర్‌ హోల్డర్ల ఫండ్‌కు బదిలీ చేయడం ద్వారా మదుపరుల్లో నమ్మకాన్ని పెంచేందుకు వీలుపడుతుందని ఎల్‌ఐసీ భావిస్తోంది. దీని వల్ల భవిష్యత్‌లో అధిక డివిడెండ్లు చెల్లించేందుకు అవకాశం ఉంఉందని సంస్థ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఫండ్‌లో ఉన్న మిగులు మొత్తాన్ని షేర్‌ హోల్డర్ల ఫండ్‌కు బదిలీ చేసేందుకు ఎల్‌ఐసీ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంది. దీనిపై ఇంకా బోర్డు ఆమోదం తీసుకోలేదు. ఇది పూర్తయిన తరువాతే ఫండ్‌ను బదిలీ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement