Tuesday, April 16, 2024

Follow up : ఒక్క రోజే 25 శాతం పతనమైన మెటా షేరు.. ఏడాదిలో 55 లక్షల కోట్లు అవిరి

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ షేరు విలువ గురువారం నాడు 25 శాతం పడిపోయింది. ఫిబ్రవరి తరువాత కంపెనీ ఒక్కరోజుల్లో జరిగిన అతి పెద్ద నష్టం ఇది. కంపెనీ ఇప్పటికే ప్రకటన ఆదాయం విషయంలో సవాళ్లను ఎదుర్కొంటోందని సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో షేరు ధర భారీగా పతనమైంది. సెప్టెంబర్‌ త్రైమాసిక ఆర్ధిక ఫలితాల ప్రకటన సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌ అదాయాలపైనా ఆయన నిరాశపరిచే అంచనాలను ప్రకటించారు. జుకర్‌ బర్గ్‌ వ్యక్తిగత సంపద గురువారం నాడు 11.2 బిలియన్ డాలర్లు(92.32 వేల కోట్లు) తగ్గి 37.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆయన బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల సూచీలో 28వ స్థానంలో ఉన్నారు.

వర్చువల్‌ రియాలిటీ, మెటావర్స్‌, కృత్తిమ మేధ వల్ల సామాఇక మాధ్యమాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందన్నారు. షార్ట్‌ వీడియో, బిజినెస్‌ మెసేజింగ్‌, మెటావర్స్‌పై పెట్టిన పెట్టుబడులు సరైన ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం మెటా స్టాక్‌ 71 శాతానికి పైగా తగ్గింది. ఇంత తగ్గినా స్టాక్‌మార్కెట్‌లో ఈ షేర్లను కొనుగోలు చేసేవారు కనిపించడంలేదు. దీని వల్ల కంపెనీ మార్కెట్‌ విలువ ఏడాదిలో 676 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు 55.72 లక్షల కోట్లు మేర తగ్గింది. దీని వల్ల విలువ పరంగా అమెరికాలో అతి పెద్ద 20 కంపెనీల జాబితాలో మెటా స్థానం కోల్పోయింది.

- Advertisement -

సవాళ్లన్నింటిని కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని జుకర్‌బర్గ్‌ ధీమా వ్యక్తం చేశారు. కంపెనీలో పెట్టుబడులున్న వారిని ఆయన అభినందించారు. వీరికి త్వరలోనే మంచి ఫలితం లభిస్తుందని చెప్పారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెటా ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం తగ్గింది. విక్రయాలు వరుసగా రెండో త్రైమాసికంలోనూ తగ్గాయి. ఈ ఏడాది కంపెనీ వ్యయాలు 85-87 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది ఇవి 96-101 బిలియన్‌ డాలర్ల వరకు చేరవచ్చని పేర్కొంది. మార్కెట్‌లో అస్థిర పరిస్థితుల కారణంగా మెటా ప్రకటన ఆదాయంలో తగ్గుదల నమోదైంది. మెటా విక్రయాల ద్వారా వచ్చే ప్రతి 10 డాలర్లలో ఒక డాలర్‌ను భవిష్యత్‌ వర్చువల్‌ టెక్నాలజీపై ఖర్చు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement