Wednesday, May 15, 2024

అర్ధశాతాబ్దం విరామం అనంతరం మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లో లెండి ప్రాజెక్టు పనులు ప్రారంభం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అంతరాష్ట్ర జల వివాదాలతో ప్రాజెక్టు రూపకల్పన చేసి అర్దశతాబ్దం గడుస్తున్నా, పనులు ప్రారంభించి నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా అంతరాష్ట్ర జలవివాదాలతో అడుగులు తడబడిన లెండి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. గత ఉమ్మడి పాలకుల పుణ్యమా అంటూ అర్ధశతాబ్దంగా అరకొర పనులు సాగిన ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో లెండి ప్రాజెక్టు ప్రారంభించి అర్ధశతాబ్ది గడుస్తుంది. ప్రాజెక్టు ప్రాధానకాలువ మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా ముఖేడ్‌ తాలుకా గోనేగాం గ్రామం దగ్గర ఉంది. మహారాష్ట్ర నాందేడ్‌ రైతులు, తెలంగాణ లోని నిజమాబాద్‌ రైతులు ప్రాజెక్టు ద్వారా లబ్ధిపొందనున్నారు. 1975లో అప్పటి ఏపీ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఉమ్మడి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేప్టటాలని నిర్ణయించారు.

1984లో ఈ ప్రాజెక్టు శంకు స్థాపన చేసి రూ.55 కోట్లతో పనులు ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే నీటి వాటాలపై వివాదాలు, అంతరాష్ట్ర జల సూత్రాలు, పర్యావరణ అనుమతులు, భూసేకరణ సమస్యలతో ప్రాజెక్టు కాలువలకే పరిమితమైంది. సమస్యను పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపినా నాటి ఆంధ్రపాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 50 ఏళ్లలో తవ్విన కాలువలు పూరుకు పోయి చెట్లు మొలవగా నిర్మాణ దశలో ఉన్న హెడ్‌ రెగ్యూలేటర్‌ శిథిలావస్థకు చేరుకుంది.

- Advertisement -

దశాబ్దాల ప్రజల కలను నిజం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం పై దృష్టి సారించింది. తెలంగాణ- మహా రాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించే ఉమ్మడి ప్రాజెక్టులను వేగ వంతం చేసేందుకు మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం దశలవారిగా చర్చలు జరిపి సమస్యల పరిష్కారం వైపు దృష్టి సారించింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటికీ భూముల ధరలు ప్రస్తుతం లేకపోవడం, ప్రస్తుత ధరలమేరకు భూనిర్మాసితుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపుతుంది. అయితే ముంపు మహారాష్ట్రంలో అధికంగా ఉండటంతో అక్కడి రైతులు ప్రస్తుత భూమిరేట్లు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించేందుకు చొరవచూపుతున్న నేపథ్యంలో నిలిచి పోయిన ప్రాజెక్టు పనులను తిరిగి నిర్వహించాలని తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.ఈ ప్రాజెక్టును జాయింట్‌ వెంచర్‌ గా చేపట్టడానికి తాజాగా తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఒప్పందం జరిగింది.

తాజాగా లెండి ప్రాజెక్టు రీడిజైనింగ్‌ మేరకు 49వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తెలంగాణ-మహారాష్ట్ర కలిసి పనులు ప్రారంభించింది. తెలంగాణలో 22వేల ఎకరాలు, మహారాష్ట్రలో 27వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. అంతరాష్ట్ర ఒప్పందం నిబంధనలు, షరతుల మేరకు తెలంగాణ -మహారాష్ట్ర రాష్ట్రాలు నీటి వ్యయాన్ని 38:62 నిష్పత్తిలో వాటా పొందుతాయి. ప్రాజెక్టు దగ్గర లభ్యం అయ్యే నీటిని 6.36 టీఎంసీలుగా ఇరురాష్ట్రాలు అంచనావేశాయి. లెండి ఉమ్మడి ప్రాజెక్టు నీటిలో తెలంగాణ వాటాగా 2.43, మహారాష్ట్ర వాటాగా 3.93 టీఎంసీల ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుత అంచనావ్యయంలో తెలంగాణ రూ.236.10 కోట్లు,మహారాష్ట్ర రూ.318.42 కోట్లు భరించేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాటా రూ.236.10 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

దశాబ్దాల సుధీర్ఘ కాలయాపనలో హెడ్‌వర్క్స్‌ 75 శాతం పూర్తి అయినా తిరిగి మరమ్మత్తులు చేయాల్సిందేనని ఇంజనీరింగ్‌ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అలాగే కుడిగట్టు ప్రధాన కాలువ మొత్తం పొడువు 25.14 కిలో మీటర్లు ఉండగా ఈ కాలువ మట్టిపనులు పూర్తి అయి సంవత్సరాలు గడవడంతో తిరిగి పనులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం కుడిగట్టుకాలువ పునరుద్ధరిస్తూ సీసీ లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సీసీ పనుల్లో 48శాతం పూర్తి అయినట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మిగిలిన పనుల అంచనాలు, పనుల ప్రణాళికలను రూపొందిస్తూ త్వరితగతిన ప్రాజెక్టుపూర్తి చేయాలనే సంకల్పంతో తెలంగాణ-మహారాష్ట్ర పనుల్లో నిమగ్నమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement