Monday, April 29, 2024

పాకిస్తాన్‌తో రెండో టెస్టులో లంక పై చేయి… 323తో ఆధిక్యం

పాకిస్తాన్‌తో గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఆతిథ్య శ్రీలంక జట్టు పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో 323 పరుగులు ఆధిక్యం సాధించింది. అంతకు ముందు పర్యాటక పాక్‌ జట్టు 191/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించింది. మరో 40 పరుగులు జోడించి, ఆలౌటైంది. లంక బౌలర్లలో రమేష్‌ మెండిస్‌ 5 వికెట్లు పడగొట్టగా, ప్రభాత్‌ జయసూర్య 3 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక ఓపెనర్లు నిరోషన్‌ డిక్‌వెల్లా (15), ఒషాడ ఫెర్నాండో (19) దూకుడుగా ఆడారు. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్‌ మెండిస్‌ (15) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో ఏంజిలో మాథ్యూస్‌ 62 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 పరుగులతో రాణించాడు. మొహమ్మద్‌ నవాజ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి, వెనుదిరిగాడు. దినేష్‌ చండీమల్‌ (21) క్రీజులో పాతుకుపోకుండా పాక్‌ బౌలర్లు అడ్డుకున్నారు. కెప్టెన్‌ డిముథ్‌ కరుణరత్నె 27, ధనంజయ డిసిల్వా 30 సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరు పెంచడానికి యత్నించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 323 పరుగుల ఆధిక్యం సాధించింది. పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షాహ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్‌కాగా, పాకిస్తాన్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే చేతులెత్తేసింది. ఆతిథ్య లంక రెండో ఇన్నింగ్స్‌లో 176/5 చేయడంతో 323 పరుగుల ఆధిక్యం లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement