Tuesday, May 7, 2024

Delhi | రైతుల కోసం లక్షల కోట్ల ప్యాకేజి.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల ఏడాది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దేశంలో ఈనాటికీ అత్యధిక భాగం జనాభా ఆధారపడ్డ వ్యవసాయం కోసం, రైతుల కోసం రూ. 3.7 లక్షల కోట్ల విలువైన భారీ ప్యాకేజికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ వినూత్న పథకాల ప్యాకేజిని ఆమోదించింది. రూ.3,70,128.7 కోట్ల విలువైన ఈ ప్యాకేజి ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతుల శ్రేయస్సు, ఆర్థిక మెరుగుదలపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు సహజ, సేంద్రీయ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే భూసారాన్ని సహజ పద్ధతుల్లో పునరుజ్జీవింపజేస్తాయని, ఫలితంగా ఉత్పాదకత పెరిగి ఆహార భద్రతను సుస్థిరం చేసుకోవచ్చని పేర్కొంది.

యూరియాపై సబ్సిడీ భారం పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తోంది. బుధవారం నాటి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో యూరియా సబ్సిడీ కోసం రూ.3,68,676.7 కోట్లు కేటాయించింది. దేశంలో రైతులు వినియోగించే యూరియాలో సింహభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంపొందిస్తూ స్వయం సమృద్ధి స్థాయి సాధించే వరకు ఈ సబ్సిడీని కొనసాగించనుంది. పన్నులు, నీమ్ కోటింగ్ ఛార్జీలు మినహాయించి యూరియా బస్తా (45 కేజీలు) రూ.242 కు రైతులకు యూరియా నిరంతరం లభ్యమయ్యేలా ఈ పథకాన్ని రూపొందించింది. సబ్సిడీ లేకుండా ఇదే బస్తాకు వాస్తవ ధర రూ. 2,200గా ఉంటుందని వెల్లడించింది. కేబినెట్ ఆమోదించిన ప్యాకేజి ద్వారా 2022-23 నుంచి 2024-25 వరకు యూరియా సబ్సిడీ కోసం కేటాయింపులు జరిపింది.

ఇది 2023-24 ఖరీఫ్ సీజన్ కోసం ఇటీవల ఆమోదించిన రూ.38,000 కోట్ల పోషకాల ఆధారిత సబ్సిడీకి అదనం అని కేంద్రం పేర్కొంది. ఎప్పటికప్పుడు మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు (ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటివి), పెరిగిన ముడి పదార్థాల ధరల కారణంగా ఎరువుల ధరలు గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక రెట్లు పెరుగుతున్నాయి. కానీ భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచడం ద్వారా మార్కెట్లో రైతులకు పాత ధరకే ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తోంది. తద్వారా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం రైతులపై పడకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోస్తోంది. ఎరువుల సబ్సిడీ కోసం 2014-15లో రూ. 73,067 కోట్లు ఖర్చు చేయగా.. 2022-23లో ఆ భారం రూ. 2,54,799 కోట్లకు చేరుకుంది.

నానో యూరియా వ్యవస్థ బలోపేతం

2025-26 నాటికి 195 లక్షల మెట్రిక్ టన్నుల సంప్రదాయ యూరియాకు సమానమైన 44 కోట్ల బాటిళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఎనిమిది నానో యూరియా ప్లాంట్లు ఏర్పాటవుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నానో ఎరువులు నియంత్రిత పద్ధతిలో పోషకాలను విడుదల చేస్తాయి. ఇది అధిక పోషక వినియోగ సామర్థ్యం కలిగి ఉండడంతో పాటు రైతులకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. నానో యూరియాను ఉపయోగించడం వల్ల పంట దిగుబడిలో పెరుగుదల కూడా ఉంటుందని కేంద్రం పేర్కొంది. దేశంలో కొత్తగా 6 యూరియా ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు, పునరుద్ధరణతోపాటు రాజస్థాన్ కోటాలో చంబల్ ఫెర్టీ లిమిటెడ్‌, పశ్చిమ బెంగాల్‌లోని మాటిక్స్ లిమిటెడ్, తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, జార్ఖండ్‌లోని సింద్రీ, బిహార్‌లోని బరౌనీ ఎరువుల కర్మాగారాల్లో 2018 నుంచి యూరియా ఉత్పత్తి పెరిగింది.

- Advertisement -

ఇవి యూరియా ఉత్పత్తిలో దేశాన్ని ఆత్మనిర్భరత దిశగా తీసుకెళ్తున్నాయని అన్నారు. దేశీయ యూరియా ఉత్పత్తి 2014-15లో 225 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22 నాటికి 250 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2022-23లో ఉత్పత్తి సామర్థ్యం 284 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. నానో యూరియా ప్లాంట్‌లతో పాటు ఈ సాంప్రదాయ యూరియా ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుత దిగుమతి భారం తగ్గి చివరకు 2025-26 నాటికి దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

భూసారం, పోషణ కోసం పీఎం ప్రణామ్

ఎల్లప్పుడూ మానవాళికి పుష్కలమైన జీవనోపాధిని అందిస్తున్న భూమాతను రసాయనాలతో కలుషితం చేయకుండా భాసారాన్ని పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్ పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయన ఎరువుల సమతుల్య, స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి సహజమైన మార్గాలకు తిరిగివెళ్లే దిశగా ఈ పథకం ఉపయోగపడుతుంది. సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ ఎరువులు, నానో ఎరువులు, బయో-ఎరువుల వంటి ఆవిష్కరణలు భూసారాన్ని పెంచి ఉత్పాదకతను పెంపొందించడంలో దోహదపడతాయని కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం “మదర్ – ఎర్త్ (పిఎంప్రణామ్‌) పునరుద్ధరణ, అవగాహన ఉత్పత్తి, పోషణ మరియు మెరుగుదల కోసం పిఎం ప్రోగ్రామ్” ప్రారంభించనున్నట్టు బడ్జెట్‌లోనే ప్రకటించింది. గోబర్ధన్ ప్లాంట్ల నుండి సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించడానికి మార్కెట్ అభివృద్ధి సహాయం (ఎండిఏ) కోసం రూ.1451.84 కోట్లు నిధులను ఆమోదిస్తూ బుధవారం కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

భూసారం పునరుద్ధరణ, పోషణ మరియు మెరుగుదల కోసం వినూత్న ప్రోత్సాహక యంత్రాంగం కూడా ఉంటుందని కేంద్రం తెలిపింది. సేంద్రీయ ఎరువుల మార్కెటింగ్‌కు మద్దతుగా మెట్రిక్ టన్నుకు రూ. 1,500 చొప్పున మార్కెట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (ఎండిఏ) అందించనున్నట్టు వెల్లడించింది. మురగబెట్టిన సేంద్రియ ఎరువులు (ఎఫ్‌ఓఎం), లిక్విడ్ ఎఫ్‌ఓఎం, ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ ఎరువులు (పిఆర్‌ఓఎం) బయో గ్యాస్ ప్లాంట్లు, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సిబిజి) గోబర్ధన్ పథకం కింద ఏర్పాటవుతాయని తెలిపింది. పర్యావరణం దెబ్బతినకుండా భూసారం పెరగడంతో పాటు ఉత్పాదకత కూడా పెరుగుతుందని వెల్లడించింది. వ్యర్థాల నుంచి సేంద్రీయ, సహజసిద్ధ ఎరువులను తయారు చేయడం కోసం గోబర్థన్ పథకం కింద 500 కొత్త వేస్ట్ టూ వెల్త్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.

మార్కెట్లోకి యూరియా గోల్డ్

రైతు ప్యాకేజీలో భాగంగా సల్ఫర్ పూతతో కూడిన యూరియా (యూరియా గోల్డ్) దేశంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వేప పూతతో కూడిన యూరియా కంటే ఇది మరింత సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది. ఇది దేశంలోని నేలలో సల్ఫర్ లోపాన్ని కూడా పరిష్కరిస్తుందని వెల్లడించింది. రైతులకు ఇన్‌పుట్ ఖర్చులను ఆదా చేయడంతో పాటు మెరుగైన ఉత్పత్తి, ఉత్పాదకతతో రైతులకు ఆదాయాన్ని కూడా పెంచుతుందని వెల్లడించింది.

చెరకు రైతులకు శుభవార్త

2023-24 చక్కెర సీజన్ లో చెరకు రైతులకు చక్కెర మిల్లులు  చెల్లించాల్సిన కనీస న్యాయమైన, లాభదాయక ధరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2023-24 చక్కెర సీజన్ (అక్టోబర్-సెప్టెంబర్)లో 10.25% ప్రాథమిక రికవరీ రేటు వద్ద  క్వింటాల్ చెరుకుకు లాభదాయక ధరగా రూ. 315 చెల్లిస్తారు. రికవరీ రేటు 10.25% మించి ఉంటే ప్రతి 0.1% పెరుగుదలకు క్వింటాల్ కు రూ. 3.07 ప్రీమియంగా చెల్లిస్తారు. రికవరీ రేటు 10.25% కంటే తక్కువగా ఉంటే ప్రతి 0.1% తగ్గుదలకు క్వింటాల్ కు రూ. 3.07 తగ్గించి చెల్లిస్తారు.  చెరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశ్యంతో, రికవరీ 9.5% కంటే తక్కువ ఉన్న చక్కెర మిల్లుల విషయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా చూడాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా రైతులు ప్రస్తుత చక్కెర సీజన్ 2022-23లో రూ.282.125/క్యూటిఎల్ స్థానంలో 2023-24 చక్కెర సీజన్‌లో చెరకు కోసం రూ.291.975/క్యూటిఎల్ పొందుతారు.

ప్రభుత్వం ఆమోదించిన న్యాయమైన, లాభదాయక ధర 2023-24 చక్కెర సీజన్‌లో (అక్టోబర్ 1, 2023 నుంచి) అమలులోకి వస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల నుంచి చక్కెర మిల్లులు చెరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చక్కెర రంగం ఒక ముఖ్యమైన వ్యవసాయ ఆధారిత రంగం. వ్యవసాయ కార్మికులు, రవాణా రంగం సహా వివిధ అనుబంధ కార్యకలాపాలలో ఉపాధి పొందుతున్నవారితో పాటు, చక్కెర మిల్లులలో నేరుగా ఉపాధి పొందుతున్న సుమారు 5 కోట్ల మంది చెరుకు రైతులు, వారిపై ఆధారపడిన జీవిస్తున్న అనుబంధ రంగాలవారిపై ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ నుంచి అందిన  సిఫార్సులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంబంధిత వర్గాలతో సంప్రదింపుల తర్వాత న్యాయమైన, లాభదాయక ధరను ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుత చక్కెర సీజన్ 2022-23లో చక్కెర మిల్లులు రూ.1,11,366 కోట్ల విలువైన సుమారు 3,353 లక్షల టన్నుల చెరకు కొనుగోలు చేశాయి. కనీస మద్దతు ధర చెల్లించి సేకరించిన వరి పంట తర్వాత చెరకు రెండవ స్థానంలో ఉంది. ప్రభుత్వం రైతు అనుకూల చర్యల ద్వారా చెరకు రైతులకు బకాయిలు సకాలంలో అందేలా చూస్తోంది. చెరకు, చక్కెరను ఇథనాల్‌గా మళ్లించడం వల్ల చక్కెర మిల్లుల చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి. మూలధన వ్యయం కూడా తగ్గింది. దీనివల్ల మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడి నిల్వలు తగ్గాయి. మిల్లుల వద్ద తక్కువ మిగులు చక్కెర కారణంగా నిధులపై ఒత్తిడి తగ్గింది. దీంతో రైతుల చెరకు బకాయిలను సకాలంలో చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది. 2021-22లో చక్కెర మిల్లులు, డిస్టిలరీలు OMCలకు ఇథనాల్‌ను విక్రయించడం ద్వారా సుమారు రూ.20,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి, దీనివల్ల రైతులు తమ చెరకు బకాయిలను త్వరితగతిన పొందగలిగారు.

ఇథనాల్ బ్లెండెడ్ విత్ పెట్రోల్ (EBP) కార్యక్రమం విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు దేశ ఇంధన భద్రత బలోపేతం చేసింది. దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనంపై  ఆధారపడటాన్ని తగ్గించింది. పెట్రోలియం రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. 2025 నాటికి  60 ఎల్ఎంటీ  కంటే ఎక్కువ చక్కెరను ఇథనాల్‌కు మళ్లించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చక్కెర నిల్వల సమస్యను పరిష్కరిస్తుంది, మిల్లుల ద్రవ్యతను మెరుగుపరుస్తుంది. రైతులకు చెరకు బకాయిలను సకాలంలో చెల్లించడానికి అవకాశం కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో  ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. పెట్రోల్‌తో కలిపి  ఇథనాల్‌ను ఉపయోగించడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గాలి నాణ్యత మెరుగుపడుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న  విధానాల ఫలితంగా చక్కెర రంగం ఇప్పుడు స్వయం సమృద్ధిగా మారింది.

భారతదేశం ఇప్పుడు ప్రపంచ చక్కెర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా భారతదేశం అవతరించింది. చక్కెర సీజన్ 2021-22 లో  చక్కెరలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం అవతరించింది. 2025-26 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తి దేశంగా అవతరిస్తుందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement