Saturday, April 27, 2024

Delhi: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి పనులు వేగవంతం .. అధికారులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం తలపెట్టిన వివిధ కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి (DONER ) కిషన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఈశాన్య రాష్ట్రాల మండలి (ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల పరిధిలో రవాణా, కమ్యూనికేషన్స్, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమలు, సంస్కృతి, పర్యాటక రంగాలతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేశారు. ఇందుకోసం సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్, ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పనితీరును కూడా కిషన్ రెడ్డి సమీక్షించారు. మరోవైపు ఈశాన్య రాష్టాల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, డోనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ టాస్క్ ఫోర్స్ ఇవ్వాల్సిన నివేదికపై పురోగతిని కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఎఫ్‌ఎస్‌యులకు శిక్షణ, వారి బాధ్యతలు తదితర అంశాలను కూడా సమీక్షించారు. కిషన్‌రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆ ప్రాంతంలోని 8 రాష్ట్రాల, రాష్ట్ర ప్రభుత్వాలతో సంపూర్ణ సమన్వయం కోసం డోనర్‌ శాఖలో 8 రాష్ట్రాలకు స్టేట్ సెక్రటేరియట్‌లతో కలిసి పనిచేసే ఫీల్డ్ సపోర్ట్ యూనిట్లను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement