Sunday, April 14, 2024

Big Story | బీజేపీలో కీలక మార్పులు.. ముందే చెప్పిన ఆంధ్రప్రభ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఊహించినట్టే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం మధ్యాహ్నం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి – హెడ్‌క్వార్టర్స్ ఇంచార్జి అరుణ్ సింగ్ పేరిట సంస్థాగత నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదలైంది. మరో ప్రకటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమిస్తున్నట్టు తెలిపారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియామక ఉత్తర్వులు విడుదలైన సమయంలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోనే ఉండగా.. బండి సంజయ్ మాత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు.

నియామక ఉత్తర్వులు జారీ చేయడానికి రెండు గంటల ముందే ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు బీజేపీ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఫోన్లు వెళ్లాయి. బండి సంజయ్ ఢిల్లీలోనే ఉన్నందున ఆయన్ను పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాయే స్వయంగా హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించారు. రాజీనామా తీసుకోవడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ఆదేశిస్తే సామాన్య కార్యకర్తగా కూడా పనిచేస్తానని, కేంద్ర మంత్రి పదవి తాను కోరుకోవడం లేదని బండి సంజయ్ చెప్పినట్టు సమాచారం.

మంత్రి పదవి కొనసాగేనా?

- Advertisement -

రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్న విబేధాలను పరిష్కరించడంతో పాటు కొత్త, పాత నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో మార్పులు చేసిన అధిష్టానం నేతల ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. బండి సంజయ్ నాయకత్వంపై అసంతృప్తితో అసమ్మతి గళం వినిపిస్తూ వచ్చిన ఈటల రాజేందర్‌ను, కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి బుజ్జగించిన సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సైతం హుటాహుటిన పిలిపించి మాట్లాడినప్పుడే రాష్ట్ర నాయకత్వంలో మార్పులపై అధిష్టానం పెద్దలు నేతలకు స్పష్టతనిచ్చారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని రాష్ట్రాధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరగా ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసిన తాను మళ్లీ వెనక్కి వెళ్లాలనుకోవడం లేదని చెప్పారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అధిష్టానం తప్పదు అంటే బాధ్యతలు భుజానికెత్తుకుంటానని.. రాష్ట్రంలో ప్రొటోకాల్‌తో పర్యటించడానికి వీలుగా కేంద్ర మంత్రి పదవిని కూడా కొనసాగించాలని అధిష్టానం పెద్దలకు చెప్పినట్టు తెలిసింది. ఆ మేరకే అధిష్టానం నిర్ణయం తీసుకుందని, మంత్రిగానూ కొనసాగుతారని కిషన్ రెడ్డి సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తులో భాగంగా కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల్లో కొన్నింటిని తొలగించవచ్చని తెలుస్తోంది.

కేంద్ర మంత్రిని రాష్ట్రాధ్యక్షుడిగా పంపాలన్న నిర్ణయం కేవలం తెలంగాణ విషయంలోనే తీసుకోలేదని, మరికొన్ని రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవిని కొనసాగిస్తే అందరి విషయంలోనూ అదే రీతిన వ్యవహరించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో జోడు పదవులు నిర్వహించరాదన్న పార్టీ నిర్ణయం మేరకు మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా కిషన్ రెడ్డి మంత్రి పదవి కొనసాగుతుందా లేదా అన్నది మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఈటల కోరుకున్నదే జరిగిందా?

ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని అనుమానంతో అంటరానివారుగా చూస్తున్నారని, పార్టీ కార్యక్రమాల్లో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తపరిచారు. ఈటల రాజేందర్ సైతం ఇన్నాళ్లుగా తాను కోరుకున్న ప్రాధాన్యత పార్టీలో దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. అనేక పర్యాయాలు ఢిల్లీకి వచ్చి అధిష్టానం పెద్దలను కలిసేవారు. అధిష్టానానికి సన్నిహితంగా ఉంటున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కూడా ఒక దశలో వెళ్లి కలిశారు. పైగా తనకిచ్చిన చేరికల కమిటీ ఛైర్మన్ పదవి నామమాత్రమే అయిందని, బీజేపీలో చేరాలనుకుంటున్న నేతలకు తాను ఎలాంటి హామీ, భరోసా ఇవ్వలేని స్థితిలో ఉన్నానని కూడా అధిష్టానం పెద్దలకు చెప్పినట్టు తెలిసింది.

ఇదిలా ఉంటే, ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన బీజేపీని తెలంగాణలో చాలా చోట్ల విస్తరించడంలో బండి సంజయ్ పాత్రను విస్మరించలేమని, ఆయన దూకుడు, దుందుడుకు విధానాలే ఇందుకు కారణమని కూడా ఆయన చెబుతుండేవారు. అయితే ఎన్నికల సమయంలో సంయమనం, సమన్వయం, వ్యూహం వంటివి కూడా చాలా అవసరమని, ప్రత్యర్థుల ఎత్తులను పసిగడుతూ పై ఎత్తులు వేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుందని చెబుతుండేవారు. పరోక్షంగా రాష్ట్ర నాయకత్వంలో అవి లోపించాయని చెప్పకనే చెబుతూ వచ్చారు. మొత్తంగా అధిష్టానం కూడా రాష్ట్ర నాయకత్వం మధ్య నెలకొన్న విబేధాలు వర్గపోరుకు దారితీశాయని గ్రహించింది. పరిస్థితి చక్కదిద్దకపోతే గ్రాఫ్ మరింత పడిపోతుందని భావించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, కో-ఇంచార్జిలతో నివేదికలు తెప్పించుకుని వాటి ఆధారంగా కసరత్తు చేపట్టింది. ఈటల రాజేందర్ సామాజికవర్గం కూడా ఆయనకు కలిసొచ్చింది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాజికవర్గం కావడం, పైగా బీసీ కావడంతో అధిష్టానం కసరత్తు సులభతరమైంది. మొత్తంగా ఆయనకు ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి వరించింది.

బండి భవితవ్యం ఏంటి?

బండి సంజయ్ కారణంగానే రాష్ట్రంలో పార్టీ ఒక దశలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ప్రధాన ప్రత్యర్థిగా, ప్రత్యామ్నాయంగా ఎదిగిందని కమలనాథులకు తెలుసు. అనేక వేదికలపై బండి సంజయ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పొగుడుతూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం పాలమూరులో జరిగిన సభలో సైతం జేపీ నడ్డా బండి సంజయ్‌ను ప్రశంసించారు. పైగా రాష్ట్రంలో ఈటల సామాజికవర్గం ‘ముదిరాజ్’ల తర్వాత బండి సామాజికవర్గం ‘కాపు’లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. పార్టీకి అందించిన సేవ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటే బండి సంజయ్‍ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని చర్చ జరుగుతోంది.

కేవలం సామాజిక సమీకరణాలే పరిగణనలోకి తీసుకుంటే మరో లోక్‌సభ సభ్యుడైన ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడైన డా. కె. లక్ష్మణ్ కూడా బండి సామాజికవర్గమైన ‘మున్నూరు కాపు’లే. కానీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి వేరే ఏ పదవీ ఇవ్వకపోతే పార్టీలో బండి వర్గం పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో సహాయ మంత్రిగా మంత్రిమండలిలోకి తీసుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని చేస్తారని, తద్వారా అమిత్ షా తన ప్రియశిష్యుడిని తన వెంట తిప్పుకోవచ్చని ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తంగా కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ నియామకలు తేలిపోగా.. బండి సంజయ్ విషయం ఇంకా ఎటూ తేలకపోవడంతో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement