Sunday, May 19, 2024

River Interlinking | కావేరి-గోదావరి వైపు అడుగులు.. నదుల అనుసంధానంపై నవంబర్‌ 3న కీలక భేటీ

అమరావతి, ఆంధ్రప్రభ : గోదావరి-కావేరి అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేలా ముందడుగు వేస్తోంది. అనుసంధాన ప్రక్రియలో భాగస్వామ్య రాష్ట్రంగా ఉన్న చత్తీస్‌ఘడ్‌ లేవనెత్తుతున్న తీవ్రమైన అభ్యంతరాలపై చర్చించి ఆ రాష్ట్రాన్ని ఒప్పించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు హైదరాబాద్‌లో నవంబర్‌ 3న దేశంలో ప్రతిపాదిత నదుల అనుసంధాన ప్రక్రియ బాధ్యతలు నిర్వహిస్తున్న జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (నేషనల్‌ వాటర్‌ డెవలప్‌ మెంట్‌ ఏజెన్సీ – ఎన్‌ డబ్ల్యుడీఏ) కీలక సమావేశం నిర్వహించనుంది.

ఎన్‌డబ్ల్యుడీఏ డైరెక్టర్‌ భోపాల్‌ సింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కీలక సమావేశానికి అన్ని భాగస్వామ్య రాష్ట్రాలకు ఆహ్వానాలు అందాయి. గోదావరి-కావేరి అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏర్పడిన స్టాండింగ్‌ కమిటీ, టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు ఒకే రోజు అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో హైదరాబాద్‌లో సంప్రదింపులు చేయనున్నాయి. ఉదయం 11.30 గంటలకు స్టాండింగ్‌ కమిటీ భేటీ అనంతరం అదే రోజు మధ్యాహ్నం కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సలహాదారుల వెదిరె శ్రీరాం ఆధ్వర్యంలలో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ కూడా భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనుంది.

టాస్క్‌ ఫోర్స్‌ కమిటీకి వెదిరె శ్రీరాం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో చత్తీస్‌ ఘడ్‌ వినియోగించుకోని 141 టీఎంసీలను గోదావరి-కావేరి అనుసంధానం కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకోగా ఇపుడా పరిమాణాన్ని మరో 10 టీఎంసీలు పెంచి 151 టీఎంసీలను తరలించాలని ఈ సమావేశాల్లో ప్రతిపాదించనున్నారు. గోదావరిలో మిగులు నీటి లభ్యత, పంపకాల గణాంకాలపై ఏర్పడిన గందరగోళాలపై మిగతా రాష్ట్రాల అభ్యంతరాలు ఎలా ఉన్నా ప్రత్యేకించి చత్తీస్‌ ఘడ్‌ మాత్రం నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

- Advertisement -

గోదావరిలో తమ రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 141 టీ-ఎంసీలను అనుసంధానం కోసం తరలిస్తే భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోతామని భావిస్తోంది. ఈ మేరకు అన్ని సమావేశాల్లో చత్తీస్‌గఢ్‌ నుంచి ఎన్‌డబ్ల్యుడీఏకు అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చత్తీస్‌ గఢ్‌తో కేంద్ర ప్రభుత్వమే నేరుగా సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. చత్తీస్‌గఢ్‌ మాత్రం తాము ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదనీ, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేస్తోంది.

తరలించే నీటి లెక్కలపై స్పష్టత ఏది..!?

గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా చత్తీస్‌గఢ్‌తో పాటు మిగతా రాష్ట్రాలు కూడా అనేక అనుమానాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. గోదావరిలోని ఇచ్చంపల్లి లేదా అనికేపల్లి నుంచి ప్రతి ఏటా జూన్‌ నుంచి అక్టోబరు మధ్య రోజుకు 2.2 టీఎంసీల చొప్పున 143 రోజుల్లో 247 టీఎంసీలను నాగార్జునసాగర్‌, సోమశిల మీదుగా కావేరి గ్రాండ్‌ ఆనకట్టకు తరలించాలని ఎన్‌ డబ్ల్యూడీఏ తొలుత ప్రతిపాదించింది.

మరికొన్ని ప్రతిపాదనలు తెరమీదకు వచ్చినా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించే ప్రతిపాదన వైపే ప్రధానంగా మొగ్గుచూపింది. ఇచ్చంపల్లి నుంచి తరలించే 247 టీ-ఎంసీల్లో 141 టీఎంసీలు చత్తీస్‌గఢ్‌వి కాగా, మిగతా 106 టీఎంసీలను మిగులు జలాలుగా ఎన్‌ డబ్ల్యూడీఏ చూపించింది. కావేరికి తరలించే జలాల నుంచి తెలంగాణకు 65.79 టీ-ఎంసీలు, ఏపీకి 79.91, తమిళనాడుకు 84.30 టీఎంసీలు కేటాయిస్తామని ఎన్‌ డబ్ల్యూడీఏ చెబుతోంది.

ఈ విషయంలో ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్‌డబ్ల్యూడీఏ మిగులు జలాలుగా చూపిస్తున్న 106 టీఎంసీలపై తమకు పూర్తిస్థాయి హక్కులున్నాయనీ, గోదావరికి దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీకి బచావత్ ట్రిబ్యునల్‌ ద్వారా దక్కిన జలాలను మిగులు జలాలుగా చూపించి కావేరికి ఎలా తరలిస్తారని గతంలోఅభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరిలో తమకు కేటాయించిన నీళ్లను తరలిస్తూ అందులో నుంచి ఏదో ప్రయోజనం చేకూరుస్తున్నట్టు 79.91 టీఎంసీలను తిరిగి ఇవ్వటమేమిటంటూ ప్రశ్నించింది.

బచావత్ ట్రిబ్యునల్‌ కేటాయింపుల జోలికి పోకుండా అదనంగా గోదావరిలో నీటి లభ్యత ఉంటేనే అనుసంధానం కోసం తరలించాలని స్పష్టం చేసింది. దీంతో ఎన్‌డబ్ల్యూడీఏ కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. ఈసారి గోదావరిలో మిగులు జలాలుగా చూపించిన 106 టీఎంసీలను తొలగించి చత్తీస్‌ ఘడ్‌ నుంచి 141 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించింది.

ఇపుడు మరో 10 టీఎంసీలను పెంచి చత్తీస్‌ ఘడ్‌ నుంచి 151 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 3న నిర్వహించనున్న ఎన్‌ డబ్ల్యుడీఏ, టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశాల్లో భాగస్వామ్య రాష్ట్రాల్రు మరోసారి తమ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement